Share News

ట్రాఫిక్‌ సమస్య తీరేదెన్నడో..?

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:54 PM

రెవెన్యూ డివిజన కేంద్రం, నియో జకవర్గ కేంద్రమైనజమ్మలమడుగు, పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య రోజు రోజుకు ఎక్కువవుతోంది.

ట్రాఫిక్‌ సమస్య తీరేదెన్నడో..?
జమ్మలమడుగు పాత బస్టాండు వద్ద ట్రాఫిక్‌ కష్టాలు

రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళుతున్న వాహనాలు

మెయిన్‌రోడ్డును ఆక్రమించి తోపుడు బండ్లు

జమ్మలమడుగులో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

జమ్మలమడుగు, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ డివిజన కేంద్రం, నియో జకవర్గ కేంద్రమైనజమ్మలమడుగు, పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య రోజు రోజుకు ఎక్కువవుతోంది. దీంతో స్థానికులతోపాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పాత బస్టాండులో బస్సులు, కార్లుతదితర వాహనాలు రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళుతుండడంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంటోంది. తోపుడుబండ్ల వ్యాపారులు మెయిన్‌రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసుకోవడంతో ట్రాఫిక్‌ సమస్యకు మరో కారణం ఉంటోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కూరగాయల మార్కెట్‌వీదిలో పూలవ్యాపారులకు వెనక్కు పంపించి రోడ్డు విశాలంగా చేశారు. అయితే గాంధీ విగ్రహం పక్కన పడమరవైపు వరుసగా ముద్దనూరు రోడ్డుకు వివిధ దుకాణాలు ఎదురుగా తోపుడు బండ్లు వెలిశాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ట్రాఫిక్‌ సమస్య ఉన్నప్పటికి ఏ ఒక్కరికి పట్టడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు రోడ్డును ఆక్రమిస్తున్నా అడిగేవారు లేరు. ప్రధాన రోడ్డుపై ప్రొద్దుటూరు వైపు నుంచి నాన్‌స్టాఫ్‌ సర్వీసులు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు, దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు గాంధీ విగ్రహం వద్ద, మలుపులో కర్నూలు రోడ్డుకు వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడంలేదు. ఇక్కడ తోపుడుబండ్లు రోడ్డుపై అడ్డంగా ఉండడంతో డ్రైవర్లు వాహనాలను అతి జాగ్రత్తగా నడపాల్సి వస్తోంది. ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రమాదం జరుగుతుందోనని బస్సు డ్రైవర్లు భయం భయంతో మలుపులో తిప్పుకుని వెళుతుంటారు. గత ఏడాది అదే ప్రాంతంలో ఆర్టీసీ బస్సు తోపుడుబండ్లవైపు బ్రేక్‌ ఫెయిల్‌ అయి దూసుకొచ్చిన ఘటనలో అక్కడున్న ద్విచక్ర వాహనాలు ధ్వంసమై లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం అధికారులు, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆ ప్రాంతంలో చర్యలు తీసుకుని ప్రమాదం జరుగక ముందే రోడ్డు వెడల్పు చేయాలని ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు, అదికారులు విన్నవించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి ఈ సమస్యను డిపో మేనేజర్‌ ప్రవీణ్‌, వారి సిబ్బంది తెలియజేసినట్లుగా కార్మికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా వెంటనే చర్యలు తీసుకోవాలనిపట్టణవాసులు కోరుతున్నారు.

Updated Date - Jun 15 , 2025 | 11:54 PM