Share News

రెవెన్యూ పట్ల చెడ్డపేరు లేకుండా సేవలందించాలి

ABN , Publish Date - Jun 20 , 2025 | 11:39 PM

రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బందిపై చెడ్డపేరు లేకుండా ఎప్పటికప్పుడు వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలకు వెనువెంటనే న్యాయబద్ధంగా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ సూచించారు.

రెవెన్యూ పట్ల చెడ్డపేరు లేకుండా సేవలందించాలి
రెవెన్యూ విశ్రాంత ఉద్యోగులను సన్మానిస్తున్న ఆర్డీవో సాయిశ్రీ, తదితరులు

రెవెన్యూ దినోత్సవ సభలో ఆర్డీవో సాయిశ్రీ

జమ్మలమడుగు, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బందిపై చెడ్డపేరు లేకుండా ఎప్పటికప్పుడు వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలకు వెనువెంటనే న్యాయబద్ధంగా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ సూచించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఆర్డీవో కార్యాలయ సభాభవనంలో డివిజన్‌స్థాయిలో రెవెన్యూడే కార్యక్రమం, సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ అన్ని శాఖల కన్నా రెవెన్యూ శాఖ చాలా ఉన్నతమైందన్నారు. రెవెన్యూ శాఖలో కిందిస్థాయి నుంచి ప్రజలకు ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారంలో ముందుండాలన్నారు. ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ దినోత్సవాన్ని రాష్ట్రమంతటా జరుపుకోవడం జరిగిందన్నారు. అనంతరం డివిజన్‌ పరిపాలన అధికారి ఇక్బాల్‌బాష మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం సేవలు అందించడమే రెవెన్యూ శాఖ లక్ష్యమన్నారు. అనంతరం ఆర్డీవో సాయిశ్రీ కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. జమ్మలమడుగు డివిజన్‌ పరిధిలో గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన రిటైర్డు ఉద్యోగులు సుబ్బారెడ్డి, పుల్లారెడ్డిలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీనివాసరెడ్డి, లక్ష్మినారాయణ, మహబూబ్‌బాష, గురప్ప, డిప్యూటీ తహసీల్దార్లు నిజాముద్దీన్‌, డివిజన్‌స్థాయిలోని రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలు, వీఆర్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.

పెద్దముడియంలో : అధికారులపై నమ్మకంతో వచ్చే ప్రజలకు నిస్వార్ధంగా సేవకులుగా పనిచేద్దామని ఆర్డీఓ సాయిశ్రీ అన్నారు. మండల కేంద్రం పెద్దముడియంలోని తహ సీల్దారు కార్యాలయంలో రెవెన్యూ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ఆర్డీవో సాయిశ్రీ హాజరై మాట్లాడుతూ వివిధ సమస్యలతో కార్యాలయానికి వచ్చే ప్రజలకు గౌరవంగా సమాధానం చెప్పి వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు బాల నరసింహులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రాజుపాలెంలో : కాలానుగుణంగా రెవెన్యూలో అనేక మార్పులు జరుగుతాయని తహసీల్దారు జి.వెంకటేశ్వర్లు అన్నారు మండల కేంద్రమైన రాజుపాలెం గ్రామ సచివా లయంలో శుక్రవారం రెవెన్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు మనోహర్‌రెడ్డి, ఆర్‌ఐ హుసేనరెడ్డి, గ్రామ రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ముద్దనూరులో:స్థానిక తహసీల్దారు కార్యాలయంలో శుక్రవారం రెవెన్యూ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. తహసీల్దారు వరదకిశోర్‌రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. అందులో భాగంగా సీనియర్‌ వీఆర్వో తిరుమలప్పను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 11:39 PM