Share News

నిరుపయోగంగా కియోస్కులు

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:23 AM

గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్భాటాల కోసం అనవసర ఖర్చులతో లక్షలాది రూపాయలు నిరు పయోగం చేసింది.

నిరుపయోగంగా కియోస్కులు
వినియోగంలో లేని కియోస్క్‌ పరికరం

యంత్రాల ఏర్పాటుకు లక్షలు నీళ్లపాలు

చేసిన గత వైసీపీ యంత్రాంగం

దిష్టిబొమ్మలా దర్శనమిస్తున్న వైనం

మూన్నాళ్ల ముచ్చటకే పరిమితం

సెల్‌ఫోనలు ఉండగా యంత్రాలు

ఎందుకంటున్న రైతన్నలు

ప్రొద్దుటూరు రూరల్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి):గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్భాటాల కోసం అనవసర ఖర్చులతో లక్షలాది రూపాయలు నిరు పయోగం చేసింది. దీంతో లక్ష్యం నెరవేరలే దుక దా! లక్షలు మాత్రం దుర్వినియోగమయ్యాయి. ఇందుకు నిదర్శనంగా రైతులు సొంత ఊరిలోనే పంట సాగుకు అవసరమైన ప్రయోజనాలను, మెలకువలను తెలుసుకునేందుకు కియోస్కో యంత్రాలను ఏర్పా టు చేసి నిర్వహణ గాలికి వదిలేసింది. దీంతో అవి మూన్నాళ్ల ముచ్చటకే పరిమితం కాగా రైతు సేవా కేంద్రాల్లో అలంకారప్రాయంగా మారాయి. ప్రొద్దుటూరు వ్యవసాయ శాఖ డివిజన్‌లో ప్రొద్దుటూరు మండలంలో 17, జమ్మలమడుగు మండల పరిధిలో 13, మైలవరం మండల పరిధిలో 13, పెద్దముడియం మండల పరిధిలో 12, కలిపి మొత్తం 55 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. వాటికి గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.80 వేలు విలువచేసే కియోస్కు యంత్రాలను మంజూరు చేశారు. సాగుదారులు రాయితీపై ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసేందుకు వీలుగా లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన కియోస్క్‌ యంత్రాలు రెండేళ్లకే మూలకు చేరాయి. ప్రారంభంలో యంత్రాల ద్వారా అరకొర సేవలు అందినా చాలా కేంద్రాల్లో ఇంటర్నెట్‌ వసతి అందుబాటులో లేక కియోస్క్‌లు నిరుపయోగంగా నిలిచాయి.

ఫ సేవలన్నీ సెల్‌ఫోన్‌లోనే

ప్రస్తుతం గ్రామస్థాయిలో పనిచేసే వ్యవసాయ సహాయక సిబ్బంది ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు, పనిముట్లు, యంత్ర పరికరాలు, ఈ-పంట నమోదు తదితర వివరాలు సెల్‌ఫోన్‌ ద్వారానే నమోదు చేస్తున్నారు. వాతావరణ సమాచారం. మార్కెట్‌ ధరలు, తదితర సేవలన్నీ సెల్‌ఫోన్‌లోనే తెలుసుకునేందుకు అవకాశం ఉంది. దీంతో కియోస్క్‌లు మూలకు చేరాయి. కూటమి ప్రభుత్వం యంత్రాల వినియోగంపై అవగాహన కల్పించి వాటిని వినియోగంలోకి తెస్తే మేలని అన్నదాతలు కోరుతున్నారు.

రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం

రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు తదితర వాటిని సెల్‌ఫోన్లలో యాప్‌ల ద్వారా నమోదు చేస్తున్నారు. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కరించే దిశగా ప్రస్తుతం అన్ని సేవలు సెల్‌ఫోన్‌లోనే వ్యవసాయ సహాయకులు అందిస్తున్నారు. సమస్యలు ఉంటే గుర్తించి పరిష్కరిస్తాం.

- వరహరి కుమార్‌, ఏవో ప్రొద్దుటూరు

Updated Date - Sep 03 , 2025 | 12:23 AM