రైతు సేవాకేంద్రాలలో సమృద్ధిగా యూరియా
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:04 AM
ప్రొద్దుటూరు డివిజన్‌లోని అన్ని రైతు సేవాకేంద్రాలలో ఖరీఫ్ సీజన్‌కు సరిపడ యూరియాను అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అనిత పేర్కొన్నారు.
ప్రొద్దుటూరు రూరల్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ప్రొద్దుటూరు డివిజన్‌లోని అన్ని రైతు సేవాకేంద్రాలలో ఖరీఫ్ సీజన్‌కు సరిపడ యూరియాను అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అనిత పేర్కొన్నారు. ప్రొద్దుటూరులోని మహాలక్ష్మి ఫర్టిలైజర్స్ దుకాణంపై రైతుల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో ఆమె తనిఖీలు నిర్వహించారు. ఈ సందర ్బంగ్ ఈపాస్ యంత్రంలోని వివరాలతోపాటు అక్కడి రికార్డులను పరిశీలించారు. ఎరువులను ఎమ్మార్పీకే అమ్మాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికి ప్రొద్దుటూరు మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో 25.8 మెట్రిక్ టన్నుల యూరియా లభ్యతలో ఉందన్నారు. జమ్మలమడుగు మండలంలో 49.5 టన్నులు, పెద్దముడియం మండలంలో 29.7 టన్నులు, మైలవరం మండలంలో 19.8 టన్నులు యూరియా అందుబాటులో ఉంచామన్నారు. మరో రెండు రోజుల్లో జమ్మలమడుగు మండలానికి 60 మెట్రిక్ టన్నులు, ప్రొద్దుటూరు మండలానికి 20, మైలవరం మండలానికి 20, అలాగే ప్రొద్దుటూరులోని చౌటపల్లి రైతు సేవాకేంద్రానికి 10 మెట్రిక్ టన్నులు, పెద్దశెట్టిపల్లె రైతు సేవాకేంద్రానికి 10 మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా సరఫరా కానుందని వివరించారు. రైతులు తొందరపడి యూరియాను కొనుగోలు చేసి నిలువ ఉంచుకోవద్దన్నారు. నిలువ చేసిన యూరియాలో తేమశాతం చేరి గడ్డకట్టం, యూరియా ఆవిరవుతుందని చెప్పారు. ఎప్పటికప్పుడు రైతులు కొనుగోలు చేసి పొలానికి చల్లుకోవాలని సూచించారు.
దువ్వూరులో: దువ్వూరులోని రైతు సేవాకేంద్రానికి సోమవారం యూరియా చేరింది. ఇక్కడికి లారీలో వచ్చిన లోడు 10 టన్నులు దింపారు. మరో 10 టన్నుల యూరియాను నీలాపురంకు తరలించి అక్కడ రైతులకు అందజేస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. మరో 220 బస్తాల యూరియా కూడా కేసీ ఆయకట్టు రైతులకు రానున్నట్లు అధికారులు వెల్లడించారు.