చెత్త ఇలా.. మరి చర్యలెక్కడ..?
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:53 PM
గ్రామీణ ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోయి దుర్వాసన కలిగిస్తున్నా పట్టించుకునేవారులేరు.
గ్రామీణ ప్రాంతాల్లో పడకేస్తున్న పారిశుధ్యం వర్షాలతో బురదమయంగా మారుతున్న రోడ్లు ఊసులేని సీజనల్ స్పెషల్‌డ్రైవ్
ప్రొద్దుటూరు రూరల్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోయి దుర్వాసన కలిగిస్తున్నా పట్టించుకునేవారులేరు. ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో డ్రైనేజీలు లేక కొన్నిచోట్ల పూడికలు తీయక మరికొన్ని చో ట్ల మురుగంతా రోడ్లపైనే ప్రవహిస్తూ అపరిశుభ్రత తాండవిస్తోంది. ఇక పందుల స్వైరవిహారం, కాటేస్తున్న దోమలతో వ్యాధుల ముప్పు వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో పారిశుధ్యం మెరుగైన చర్యలు కోసం అధికారులు చేపట్టే సీజనల్ స్పెషల్‌డ్రైవర్ ఊసులేకుండాపోయింది. దీంతో పల్లెలు వర్షంధాటికి తడిసి చిగురుటాకుల్లా వణుకుతున్నాయి.
ప్రొద్దుటూరు మండల పరిదిలో 15 గ్రామ పంచాయతీలకు సంబందించి 60కిపైగా ఉన్న గ్రామాల్లో సింహభాగం మురుగుపారుదల, కాలువల ఏర్పాటు పనులకు ప్రాధాన్యత లేకపోవడంతో ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. కూటమి ప్రభుత్వం తొలి దశలో గ్రామాల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేయగా రెండవ విడతలో రూ.4.25 కోట్ల వ్యయంతో పలు చోట్ల కాంక్రీటు రహదారులు ఉపాధి హామీ నిధులను మంజూరు చేశారు. అయితే నరేగా కింద నిధులు కేటాయింపు జరుగకపోవడంతో కాలువ నిర్మాణాలకు అతీగతి లేకుండా పోవడంతో విమర్శలున్నాయి.
నివారణ చర్యలేవీ
దోమల నివారణకు రసాయనాల పిచికారి ఫాగింగ్ తదితర చర్యలు గ్రామాల్లో ఎక్కడా కనిపించడంలేదని స్థానికులు వాపోతున్నారు. వీధుల్లో పారిశుధ్యం మెరుగుపడక దుర్గందంతో కంపుకొడుతోంది. సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండడంతో గ్రామీణ ప్రజలు ఇక్కట్లు పడు తున్నారు. ఇక ప్రతి శుక్రవారం చేపట్టే ఫ్రైడే డ్రైడే తూతూ మంత్రంగా సాగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.