ఎక్కడా యూరియా సమస్య లేదు : ఆర్డీవో
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:39 PM
జమ్మలమడుగు, ప్రొద్దుటూరు సబ్‌డివిజన్ పరిధిలో ఎక్కడ కూడా యూరియా సమస్య లేదని జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ, ప్రొద్దుటూరు సబ్‌డివిజన్ వ్యవసాయ టెక్నికల్ అధికారి సుశ్మిత వెల్లడించారు.
జమ్మలమడుగు, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగు, ప్రొద్దుటూరు సబ్‌డివిజన్ పరిధిలో ఎక్కడ కూడా యూరియా సమస్య లేదని జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ, ప్రొద్దుటూరు సబ్‌డివిజన్ వ్యవసాయ టెక్నికల్ అధికారి సుశ్మిత వెల్లడించారు. శనివారం జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయ చాంబర్‌లో యూరియా సమస్యపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ జమ్మలమడుగు నియోజకవర్గం వరిసాగు చేసిన రైతాంగానికి యూరియా అందకపోతే వెంటనే రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లి తెలియజేయాలన్నారు. అక్కడ సమస్య ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు. ఇప్పటి వరకు వరి సాగు చేసిన రైతాంగానికి యూరియా ఇబ్బందులు లేవన్నారు. ప్రొద్దుటూరు వ్యవసాయ టెక్నికల్ ఏవో సుశ్మిత మాట్లాడుతూ జమ్మలమడుగు సబ్‌డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు యూరియా 519 టన్నులు సరఫరా జరిగిందని, 501 టన్నులు రైతులకు అందజేయడం జరిగిందని, 16 టన్నులు ప్రైవేటు షాపుల వద్ద నిలువ ఉందని ఎక్కడ సమస్య లేదన్నారు. అలాగే మరికొంత రైతు సేవా కేంద్రాల వద్ద ఉంచడం జరిగిందన్నారు. ఆయా ప్రాంతాల్లో రైతులకు యూరియా ఇబ్బందులు ఉంటే వెంటనే తెలియజేయాలన్నారు. ఇప్పటికే రైతులు రెండుసార్లు యూరియా ఉపయోగించారన్నారు.ప్రతి గ్రామంలో రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లి అవసరమైన వారు తీసుకెళ్లాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు యూరియా సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. మందుల దుకాణాల వారు సమస్యను సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ సీఐ నరేష్‌బాబు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.