కలిసి వచ్చిన పసుపు పంట
ABN , Publish Date - Mar 10 , 2025 | 12:06 AM
పచ్చ బంగారంగా పిలిచే పసుపు పంట ప్రస్తుత ఏడాది రైతన్నకు కలిసివచ్చింది.

జోరుగా పసుపు తవ్వకాలు
దువ్వూరులో దిగుబడులు మిశ్రమం
రాజుపాళెంలో ఆశాజనకం
పర్వాలేదనిపిస్తున్న వట్టి పసుపు ధరలు
కష్టాలు తీరుతాయంటున్న రైతన్నలు దువ్వూరు, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): పచ్చ బంగారంగా పిలిచే పసుపు పంట ప్రస్తుత ఏడాది రైతన్నకు కలిసివచ్చింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికందుతుండడంతో సాగు చేసిన రైతుల్లో ఉత్సాహం కనపడుతుంది. వట్టి పసుపు ధరలు ఒకింత పర్వాలేదనిపించడమే ఇందుకు కారణం. దీంతో పంట తవ్వకాలు ఊపందుకున్నాయి. దువ్వూరు మండలంతోపాటు మైదుకూరు, ఖాజీపేట, చాపాడు, బ్రహ్మంగారిమఠం ప్రాంతాల్లో రైతులు పసుపును విస్తృతంగా సాగు చేశారు. నియోజకవర్గ పరిధిలో మైదుకూరు ప్రాంతంలో అధికంగా 1011 ఎకరాల్లో పసుపు పంట సాగైంది. వ్యవసాయాధికారుల లెక్కల మేరకు దువ్వూరు మండలంలో 582 ఎకరాల్లో, ఖాజీపేట ప్రాంతంలో 408 ఎకరాల్లో, చాపాడు మండలంలో 350 ఎకరాలకుపైగా, బి.మఠం మండలంలో 50కిపైగా ఎకరాల్లో ఈ పంట పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా నియోజకవర్గ పరిధిలో 2,400 ఎకరాలకుపైగా సాగైంది. ఒక ఎకరాలో ఈ పంట సాగుకు రూ.1.30 లక్షల దాకా పెట్టుబడుల కింద వెచ్చించారు.
వెంటాడిన తెగుళ్లు
పసుపు పంటను ఈ యేడు తెగుళ్లు అధికంగా సోకాయి. మొదట పైరు బాగా కనిపించినా పెరిగేకొద్ది దుంపకుళ్లు సోకింది. చాలా మంది రైతుల పొలాల్లో తెగుళ్ల ప్రభావంతో దిగుబడి తగ్గింది. ఉండకొమ్ముకు చుట్టిన రెమ్మలు పుచ్చుపట్టి దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడి తగ్గింది
పర్వాలేదనిపిస్తున్న ధరలు
మార్కెట్‌లో వట్టి పసుపు క్వింటా రూ.9,500 పలుకుతోంది. నిరుడు గరిష్టంగా క్వింటాలు వట్టి పసుపు 1500 వేలు పైబడి ధర పలికింది. ప్రస్తుతం రూ.9,300 ధర ఉంది. అయితే కొత్త పసుపు ధర పెరుగుతుందనే ఆశాభావం రైతుల్లో వ్యక్తమవుతోంది.
రాజుపాళెంలో ఆశాజనకంగా పసుపు
రాజుపాలెం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఆరుగా లం కష్టించే రైతన్నకు ఈ సంవత్సరం పసుపు పంట పండింది. దిగుబడి పెరగడంతో కొన్నే ళ్లుగా నష్టాలతో కష్టాలు పడుతున్న రైతన్నలు ప్రస్తుతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎకరా కు 20 నుంచి 25 క్వింటాళ్లు దిగుబడి రావడం తో పాటు మార్కెట్లో కూడా క్వింటాలు రూ10 వేలు ధర పలుకుతుండడంతో రైతన్నల్లో ఆ నందం వ్యక్తమవుతోంది. మండల పరిధిలోని కేసీ కెనాల్ కింద దాదాపు 200 ఎకరాలకు పైబడి ఈ పంట సాగులో ఉంది. ఎకరాకు 25 క్వింటాళ్లు దిగుబడి రావడంతో ఎకరాకు రూ.30 నుంచి రూ40వేలు మిగులు తుందని రైతులు అంటున్నారు. దిగుబడితో పాటు క్వింటా రూ. 15వేల నుంచి రూ.20వేల వరకు అమ్మితే మంచి లాభాలు వస్తాయని రైతన్నలు పేర్కొం టున్నారు. ఏది ఏమైనా పసుపు పంట రైతన్న లకు ఊరట లభించింది.