జగజ్జననీ.. లోకపావని
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:43 PM
దసరా శరన్న వరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు జగజ్జననీ.. లోకపావని అయిన అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
ప్రొద్దుటూరు టౌన్, సెప్టెంబరు 26 (ఆంరఽధజ్యోతి): దసరా శరన్న వరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు జగజ్జననీ.. లోకపావని అయిన అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిశాలలో మధ్యాహ్నం శ్రీదేవి వనవిహారిణిగా, రాత్రికి పార్వతీదేవిగా దర్శనమివ్వగా, రతనాల వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి వనవిహారిణిగా భక్తులను కరుణించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులు భక్తులను ఆకట్టుకున్నాయి. చెన్నకేశవస్వామి ఆలయంలో మోహిని వనవిహారిణిగా, రామేశ్వరంలోని ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయం, వైఎంఆర్ కాలనీలోని రాజరాజేశ్వరీదేవి ఆలయంలో పార్వతీదేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. గౌరమ్మ కట్టవీధిలో వనవిహారిణిగా, సత్యనారాయణస్వామి ఆలయంలో వైష్ణవీదేవి అలంకారం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.
జమ్మలమడుగులో: జమ్మలమడుగులో దసరా శరన్నవరాత్రుల 5వరోజు శ్రీమత్కన్యకాపరమేశ్వరీదేవి రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అలాగే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని కన్యతీర్థంలో బాలత్రిపురసుందరీదేవి అమ్మవారు మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు.
మైదుకూరు రూరల్‌లో : మైదుకూరు అమ్మవారిశాలలో శుక్రవా రం అన్నపూర్ణాదేవి అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమి చ్చారు.స్థానిక అమ్మవారిశాలలో ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బల్లాని చెన్నకేశవ ప్రసాద్ ఆద్వర్యంలో నూతన కార్యవర్గం దసరా వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు.
బద్వేలుటౌనలో : పట్టణంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు . 5వ రోజు అమ్మవారు వాసవీకన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పోలీస్‌స్టేషన ఆవరణలో వెలసిఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో రాజరాజేశ్వరిదేవిగా, కోదండరామస్వామి ఆలయంలో సరస్వతీదేవి అలంకారంలో, మహాలక్ష్మీదేవి ఆలయంలో సరస్వతీదేవి అలంకారంలో, భద్రకా ళీసమేత వీరభద్రస్వామి ఆలయంలో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
పోరుమామిళ్లలో: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పోరు మామిళ్లలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం రాత్రి అమ్మవారిని వనవిహారినీ అలంకారంగావించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
ఎర్రగుంట్లలో: దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఎర్రగుంట్ల మెయినబజార్‌లోని అమ్మవారిశాలలో వాసవాంబ శ్రీదేవి వనవిహారిణీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏరువాక గంగమ్మ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మీ దేవిగా చౌడేశ్వరీదేవి ఆలయంలో లక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు.