Share News

రంగునీళ్లతో పెన్నా కలుషితం

ABN , Publish Date - May 22 , 2025 | 11:52 PM

రంగు నీళ్లు కలుస్తుండడంతో పెన్నానది కలుషితంగా మారుతోంది.

రంగునీళ్లతో పెన్నా కలుషితం
పెన్నానదిలో కలుస్తున్న రంగునీళ్లు

తాగునీటి కాలువ రంగునీరుగా మారిన వైనం హామీలకే పరిమితమైన నేతల ప్రకటనలు నీటి కలుషితంతో ప్రజల ఇక్కట్లు

జమ్మలమడుగు, మే 22 (ఆంధ్రజ్యోతి): రంగు నీళ్లు కలుస్తుండడంతో పెన్నానది కలుషితంగా మారుతోంది. దీంతో పెన్నా చుట్టుపక్క గ్రామా ల ప్రజలకు తాగునీరు కలుషితమై ఇక్కట్లు పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామం శ్రీరాములపేట రాణి కాలువ రంగునీళ్లతో నిండి మురుగు కాలువగా మారింది. బ్రిటీష్‌ కాలంలో మోరగుడి గ్రామం శ్రీరాములపేట వద్ద పెన్నానది నుంచి పెద్దముడియం మండలం పెద్దపసుపుల గ్రామానికి మంచినీటి కోసం కాలువ తీశారు. ఇది అప్పట్లో రాణి కాలువగా పేరుపొందింది. అప్పటి నుంచి ఇప్పటివరకు రాణికాలువ పోయి రంగునీళ్ల కాలువ, తర్వాత మురుగునీటి కాలువగా మారుతూ వస్తోంది. మోరగుడి గ్రామంలో లో అద్దకం బట్టీల నుంచి వచ్చే కెమికల్‌తో కూడిన రంగునీళ్లు కాలువ గుండా ప్రవహిస్తూ మైలవరం మండలం దొమ్మరనంద్యాలజిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పక్కన పెన్నానదిలో కలుస్తున్నాయి. ఈ రంగునీళ్లు పెన్నానదిలో కలుషితమై అక్కడి బోర్లలో చేరుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. గత 20 సంవత్సరాల క్రితం జమ్మలమడుగులో ఇప్పటి వరకు గెలుపొందిన ఎమ్మెల్యేలు సైతం రాణికాలువకు మంచిరోజులు వస్తాయని, కాంక్రీటుతో కాలువ నిర్మాణం చేపట్టి రంగునీళ్లు పెన్నాలో చేరకుండా చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించడం ఆ తర్వాత కాలువ గురించి పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం అద్దకపు బట్టీల కెమికల్‌తో కూడిన రంగునీళ్లు శ్రీరాములపేట వద్ద నుంచి పెన్నానదిలోకి నేరుగా కలుస్తున్నాయి. రాణికాలువ ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునేవారే లేరని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి కాలువను పరిశీలించి తగు చర్యలు తీసుకోవడంతోపాటు కనీసం రంగునీళ్లు పెన్నా లో చేరకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - May 22 , 2025 | 11:52 PM