Share News

ఆ రెండు వసతి గృహాలకు డిమాండ్‌

ABN , Publish Date - Jun 24 , 2025 | 11:59 PM

జమ్మలమడుగులోని ప్రభుత్వ వసతి గృహంతో పాటు దొమ్మరనంద్యాల వసతి గృహాల్లో సీట్ల కోసం విద్యార్థులు ఎగబడుతున్నారు.

 ఆ   రెండు వసతి గృహాలకు డిమాండ్‌
జమ్మలమడుగు ప్రభుత్వ బాలికల వసతి గృహం

జమ్మలమడుగు, దొమ్మరనంద్యాల వసతి గృహాల్లో సీట్ల కోసం ఎగబడుతున్న విద్యార్థులు ఖాళీలు లేవంటున్న వార్డెన్లు

జమ్మలమడుగు, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగులోని ప్రభుత్వ వసతి గృహంతో పాటు దొమ్మరనంద్యాల వసతి గృహాల్లో సీట్ల కోసం విద్యార్థులు ఎగబడుతున్నారు. అయితే ఇప్పటికే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని సీట్లు ఖాళీలు లేవంటూ వార్డెన్లు వచ్చిన వారిని వెన క్కి పంపివేస్తున్నారు. అదనపు సీట్లు పెంచి అక్కడే వసతి కల్పించాలంటూ విద్యార్థులతోపా టు వారి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతు న్నారు. వివరాల్లోకి వెళితే.. జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని ముద్దనూరు రోడ్డులో గల ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఆవరణలో ఉన్న కళాశాల వసతి గృహానికి సీట్ల డిమాండ్‌ పెరిగింది. కూటమి ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి ముందుగా పట్టణంలోని, ఇతర గ్రామాల్లో ప్రభుత్వ వసతి గృహాల సమస్యలను పరిష్కరించారు. అందులో భాగంగా కళాశాల వసతి గృహానికి కొత్త భవనాల ఏర్పాటు కనీస సౌకర్యాలు కల్పించారు. కళాశాల ఆవరణంలోనే బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థినులు చదువుకోవడానికి వసతి గృహంలోని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారి తల్లిదండ్రులు ఆ కళాశాల వసతి గృహంలో సీట్ల కోసం క్యూ కట్టారు. ప్రతిరోజు సీట్లు కావాలని వస్తున్నారు. అలాగే మైలవరం మండలం దొమ్మరనంద్యాల ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం పక్కనే జిల్లా పరిషత్‌ పాఠశాల ఉండడం వలన ఉపాధ్యాయులు చదువు చక్కగా చెబుతున్నారని పేరు ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అక్కడ పాఠశాలలు ఉన్నప్పటికి వసతి గృహంలో చేర్చి పాఠశాలకు పంపించేందుకు ఎక్కువ మంది వస్తున్నారు. అందుకోసం ఆ రెండు ప్రభుత్వ వసతి గృహాల్లో నిబంధనలకు మించి విద్యార్థులను చేర్చుకున్నట్లు వార్డెన్లు తెలిపారు. అయితే గత రెండు రోజుల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి ఆ రెండు వసతి గృహాలకు 10వ తరగతి, ఇతర తరగతుల్లో , జూనియర్‌, డిగ్రీ కళాశాలలకు సంబందించిన కళాశాల వసతి గృహానికి విద్యార్థులు సీట్లు కావాలని వస్తున్నారు. ప్రస్తుతం అక్కడ అన్నీ సీట్లు భర్తీ అయ్యాయని అక్కడ పనిచేస్తున్న వార్డెన్లు మనోరాణి , వెంకటరెడ్డి వస్తున్న దరఖాస్తులను సీట్లు లేవని వెనక్కు పంపుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వం జమ్మలమడుగులోని ప్రభుత్వ బాలికల వసతిగృహంలో కాకుండా ఇతర ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యం, భోజనంపెడుతుండడంతో ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల, బాలికల జూనియర్‌ కళాశాల, బీసీ వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఆ రెండు వసతి గృహాలకు సంబందించి గత నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దృష్టికి ఆ వార్డెన్లు సీట్లు పెంచాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేయాలని కోరినట్లు తెలిసింది.ఒక్కొక్క వసతి గృహంలో వంద మంది ఉండాల్సిన విద్యార్థులకు 115 మంది ఉన్నట్లు, ఇంకా పెంచాలని వార్డెన్లు కోరుతున్నారు. కొందరు సీట్లు తప్పనిసరిగా ఇవ్వాలంటూ సంబందిత నేతల లెటర్‌ప్యాడ్లు తీసుకుని వస్తున్నారని వెంటనే జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వార్డెన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jun 24 , 2025 | 11:59 PM