పెన్నాలో జోరుగా నీళ్లు.. గ్రామాల్లో నీటి కష్టాలు
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:48 PM
పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తున్నా జమ్మలమడుగు పరిసర ప్రాంతాల గ్రా మాల ప్రజలకు తాగునీటి కష్టాలు తప్ప డంలేదు.
జమ్మలమడుగు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి):పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తున్నా జమ్మలమడుగు పరిసర ప్రాంతాల గ్రా మాల ప్రజలకు తాగునీటి కష్టాలు తప్ప డంలేదు. గత 15 రోజుల నుంచి ఎగువ ప్రాంతంలో వర్షాలు అధికంగా కురిసి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జీఎన్‌ఎస్‌ఎస్ కాలువ, ఆపై గండికోట ప్రాజెక్టు, అక్కడి నుంచి మైలవరం జలాశయం, పెన్నానదిలో వరద ప్రవాహం ఉదృతంగా ప్రవహిస్తోంది. జూన్, జూలై మాసాల్లో వర్షాలు లేక రైతులు, ప్రజలు వర్షం కోసం ఎదురుచూశారు. తర్వాత ఆగస్టు నెలలో ఆలస్యంగానైనా వర్షాలు బాగాపడడంతో మైలవరం జలాశయం నుంచి ప్రతిరోజు పది వేల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం కొనసాగుతుంది. అయితే మైలవరం, వేపరాల దొమ్మరనంద్యాల, మోరగుడి, పొన్నతోట, గూడెం చెరువు, అంబవరం, గొరిగెనూరు, తదితర గ్రామాలకు మంచినీటి కోసం పెన్నానదిలో ఏర్పాటు చేసిన బోర్లకు వరద ప్రవాహంతో అధికారుల సూచనల మేరకు గ్రామ పంచాయతీల అధికారులు బోర్ల వద్ద పైపులు, విద్యుత వైర్లు తొలగించడంతోఆ గ్రామాలకు మంచినీటి సరఫరా ఆగిపోయింది. ప్రజలు సమీప పొలాల్లో బోర్ల వద్ద నీళ్లను తెచ్చుకుంటున్నారు. దొమ్మరనంద్యాల గ్రామంలో గ్రామ పంచాయతీవారు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నా అవి పూర్తిగా సరిపోవడంలేదని దీంతో తాగునీటికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. పెన్నానదిలో వరద ప్రవాహం తగ్గే వరకు తాగు నీటి కష్టాలు తప్పవని జ్రలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మైలవరం జలాశయం వద్ద నుంచి జమ్మలమడుగుపట్టణ ప్రాంతానికి మంచినీటి సరఫరా చేసే మున్సిపల్ ఫ్యూరిఫైడ్ వాటర్ ట్యాంకు నుంచి గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా పెన్నానది వరద ప్రవాహంతో వేపరాల నుంచి జమ్మలమడుగు వెళ్లే రహదారులు కోతకు గురయ్యాయి. అలాగే దానవులపాడు వద్ద పెన్నానదిలో రోడ్డు కోతకు గురైంది.