Share News

పెనుగాలులకు తీవ్ర నష్టం

ABN , Publish Date - May 02 , 2025 | 11:27 PM

ఏడాదికాలం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ కాపాడుకున్న అరటి పంట చేతికొచ్చే సమయంలో పెనుగాలులు రైతు నోట్లో మట్టి కొట్టాయి.

పెనుగాలులకు తీవ్ర నష్టం
ఓబులవారిపల్లె:దెబ్బతిన్న అరటి తోట వద్ద రైతు కంచర్ల శ్రీనివాసులు

ఓబులవారిపల్లె, మే 2 (ఆంధ్రజ్యోతి) : ఏడాదికాలం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ కాపాడుకున్న అరటి పంట చేతికొచ్చే సమయంలో పెనుగాలులు రైతు నోట్లో మట్టి కొట్టాయి. మండలంలోని చిన్నఓరంపాడు, కమ్మపల్లెకు చెందిన కంచర్ల ప్రభాకర్‌, కంచర్ల శ్రీనివాసులు సుగంధాలు (కర్పూరం)రకం అరటి సాగు చేశారు. పంట పూర్తిస్థాయి దిగుబడి వచ్చింది. ఒక్కో గెల సుమారు 20 కిలోలు పైనే ఉంది. గత వారంలో 10 గెలలు మాత్రమే కోతకు రావడంతో వ్యాపారి కోత మొదలుపెట్టారు. రెండు మూడు విడతల్లో పూర్తిస్థాయి పంట అందుతుందనే ఆనందంలో ఉండగానే గురువరం రాత్రి వీచిన గాలులకు అరటి చెట్లు నేలకొరిగాయని రైతులు కంచర్ల ప్రభాకర్‌, కంచర్ల శ్రీనివాసులు ఆవేదన చెందారు. ఒక ఎకరాలో అరటి సాగుకు సుమారు రూ.లక్ష ఖర్చు వస్తుందని, కనీసం ఖర్చులకు కూడా రాకుండా గాలి నష్టాలపాలు చేసిందని, ప్రభు త్వం ఆదుకోవాలని విన్నవించారు.

పెనగలూరులో నేలరాలిన మామిడి

పెనగలూరు, మే 2 (ఆంధ్రజ్యోతి) : పెనుగాలులకు సిద్దవరం, ఓబిలి గ్రామాల పరిధిలో మామిడి రైతులకు భారీ నష్టం జరిగింది. అసలే ఈ యేడాది మామిడి కాపు బాగా లేదని, ఖర్చులకు కూడా రావేమోనని రైతులు అనుకుంటుండగా రైతులను పెనుగాలులు పూర్తిగా దెబ్బతీశాయి. ఉన్న కాస్తా కాయలు కూడా పెనుగాలుల దెబ్బకు నేలరాలిపోయాయి. కాగా కోడిచెన్నయ్యగారిపల్లె, పద్మయ్యగారిపల్లె గ్రామాల్లో భారీ వర్షం కురిసిందని ఆ గ్రామ ప్రజలు తెలిపారు. పదును వర్షం పడి ఉంటుందంటున్నారు.

Updated Date - May 02 , 2025 | 11:27 PM