ఆర్టీసీ ఉచిత బస్సు.. మహిళలు ఫుల్
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:08 AM
జమ్మలమడుగులో ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యానికి రోజు రోజుకు మహి ళల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
జమ్మలమడుగు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగులో ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యానికి రోజు రోజుకు మహి ళల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. జమ్మలమడుగు ఆర్టీసీ డిపో నుంచి ప్రొద్దుటూరుకు వెళ్లే ఆర్డినరీ సర్వీసుల్లో మహిళలు భారీగా తరలివచ్చి ప్రయాణం చేస్తున్నారని ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు తెలిపారు. అందులో భాగంగా జమ్మలమడుగులో పాత బస్టాండు వద్ద ప్రొద్దుటూరు నుంచి వచ్చిన బస్సులో అంద రూ మహిళలే ప్రయాణించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్త్రీశక్తి పథకం ఆదరణ బాగా ఉందని మహిళలు చెప్పుకోవడం విశేషం. అయితే జిల్లా అధికారులు త్వరగా నాన్‌స్టాఫ్ సర్వీసులను స్త్రీ శక్తి పథకానికి అనుమతించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రవీణ్ మాట్లాడుతూ జమ్మలమడుగు డిపోలో ఉన్న 72 బస్సులకుగాను 36 ఆర్టీసీ బస్సులు, 36 అద్దె బస్సులు ఉన్నాయని, అందులో స్త్రీశక్తి పథకానికి 43 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 13,926 మంది మూడు రోజుల్లో ఆదివారం వరకు మహిళలు ప్రయాణం చేశారని, సోమవారం సైతం అన్ని బస్సుల్లో మహిళలు ఎక్కువగా ప్రయాణం చేశారని తెలిపారు.