Share News

కేసీ కింద జోరుగా వరినాళ్లు

ABN , Publish Date - Aug 17 , 2025 | 11:43 PM

కేసీ కెనాల్‌కు నీరు రావడంత ఆయకట్టు పరిధిలో వరినాట్లు జోరందుకున్నాయి.

కేసీ కింద జోరుగా వరినాళ్లు
కేసీ ఆయకట్టు కింద వరినాట్లు వేస్తున్న కూలీలు

దువ్వూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): కేసీ కెనాల్‌కు నీరు రావడంత ఆయకట్టు పరిధిలో వరినాట్లు జోరందుకున్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో కాలువకు ముందుగా నీరు రావడంతో రైతులు నారుదొడ్లు పోయడం, ఎదిగిన నారును నాటడం, జరుగుతోంది. నియోజకవర్గంలోని దువ్వూరు, మైదుకూరు, చాపాడు, ఖాజీపేటతోపాటు రాజుపాళెం పరిధిలో వరినారుమళ్లు ఊపందుకున్నాయి. ఆయకట్టు పరిధిలో వరి పంట ప్రధానంగా సాగు చేస్తారు. ప్రతి ఏటా ఆగస్టు మధ్యలో కేసీ కాలువకు నీరు అందేది. ఈఏడు వర్షాలు సహకరించడంతో ప్రాజెక్టులు నిండి ముందుగానే నీరు రావడంతో ఈ ఏడు 20 నుంచి 25 రోజులు ముందుగానే వరినాట్లు వేసే పనులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పొలాలను ట్రాక్టర్లతో దమ్ము చేస్తున్నారు. వసతిని బట్టి దమ్ముతోపాటు ఎద్దులతో మాను తోలి పొలాన్ని చదరగట్టి గనేలు వేస్తుండగా కూలీలు నాటు వేయిస్తుండడంతో పెట్టుబడులు తడిసి మోపెడు అవుతున్నాయి. నాట్లు వేసే ముందు ఎరువులను పొలంలో చల్లుతున్నారు.

పెరిగిన పెట్టుబడులు: వరిసాగుకు పెట్టుబడులు పెరిగాయి. విత్తనం వడ్లు కొనుగోలు, పొలాన్ని దుక్కి చేయడం తదనంతరం నీరు పెట్టి దమ్ము చేయడం, రసాయనిక ఎరువుల కొనుగోళ్లు, నాట్లు వేసే కూలీల ఖర్చు, గెనెల తయారీ, ఇతరత్రా పెట్టుబడుల కింద ఖర్చు అధికంగా వస్తోందని రైతులు అంటున్నారు. వ్యాపారులు ఎరువుల ధరలను ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఏయేటా సాగు ఖర్చు పెరుగుతున్నాయనేది రైతులు వెలిబుచ్చుతున్న అభిప్రాయం.

24 వేల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం

మైదుకూరు డివిజన్‌ పరిధిలో ఈ ఏడు 24 వేల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దువ్వూరు పరిధిలో 6,500 ఎకరాల్లో, మైదుకూరు 3 వేల ఎకరాలు, చాపాడు 12 వేల ఎకరాలు, రాజుపాళెం 1800 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేస్తున్నారు. నియోజకవర్గ పరిదిలోని ఖాజీపేట ప్రాంతంలో కూడా విస్తృతంగా వరి సాగుకు పూనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పనులు మొదలవుతుండడంతో కూలీలకు గిరాకీ పెరిగింది.

సాగైన పంటలకు ఊరట కలిగించిన వర్షం

రాజుపాలెం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): వర్షాలు పడుతుండడంతో సాగైన పత్తి తదితర పంటలకు కాస్త ఊరట లభించింది. మండలంలో దాదాపు 250 ఎకరాల పైబడి పత్తిపంటను సాగు చేసిన రైతన్నలకు మొలక దశలోనే ఎండిపోతోంది. అయితే గత మూడురోజులుగా ఒక మోస్తరు వర్షం పడుతుం డడంతో సాగైన పంటలకు మేలుచేకూరింది. కాగా వర్షాలు జోరందుకుంటే జొన్న, మినుముపంటలు సాగు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుందని రైతులు తెలిపారు.

Updated Date - Aug 17 , 2025 | 11:43 PM