పునరావాసం కల్పించి న్యాయం చేయండి
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:45 PM
దాల్మియా పరిశ్రమ వలన దుమ్ము, ధూళితో పంటలు పండక రోగాల బారీన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాకు పునరావాసం కల్పించి న్యాయం చేయాలని జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీకి దుగ్గనపల్లె గ్రామస్థులు మొరపెట్టుకున్నారు.

ఆర్డీవోకు దుగ్గనపల్లె గ్రామ ప్రజల విజ్ఞప్తి
మైలవరం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): దాల్మియా పరిశ్రమ వలన దుమ్ము, ధూళితో పంటలు పండక రోగాల బారీన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాకు పునరావాసం కల్పించి న్యాయం చేయాలని జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీకి దుగ్గనపల్లె గ్రామస్థులు మొరపెట్టుకున్నారు. ఈనెల 27న దాల్మియా రెండవ ప్లాంట్‌కు జరిగే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా ప్రజాభిప్రాయాలను తెలుసుకునేందుకు దుగ్గనపల్లె గ్రామంలో మంగళవారం ఆర్డీవో సాయిశ్రీ పర్యటించి గ్రామ ప్రజల సమస్యలు, వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో గ్రామస్థులు మాట్లాడుతూ దాల్మియా పరిశ్రమకు తాము వ్యతిరేకం కాదని, దుమ్ము, దూళితోపాటు బ్లాస్టింగ్ వలన ఇల్లు నెర్రలు చీలడం, సాగు చేసిన పంటలపై దుమ్ము, ధూళి పడి దెబ్బతింటున్నాయని ధూళి కాలుష్యం వలన పిల్లలు అనారోగ్యం భారీన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆర్డీవోకు వివరించారు. గ్రామానికి పక్కనే దాల్మియా పరిశ్రమ ఉండడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని మా గ్రామాన్ని వేరే చోటికి తరలించి మాకు పునరావాసం కల్పించిన తర్వాత మా భూములు దాల్మియా యాజమాన్యం కొనుగోలు చేయాలని వారు ఆర్డీవో కు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు లక్ష్మినారాయణ, డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.