Share News

లాభదాయకంగా నిమ్మ సాగు

ABN , Publish Date - Mar 13 , 2025 | 11:53 PM

పర్యాటక ప్రాంతమైన గండికోట నిమ్మపంటకు ప్రసిద్ధి చెందింది.

లాభదాయకంగా నిమ్మ సాగు
తోటలో నిమ్మకాయలను వేరు చేస్తున్న కూలీలు

పర్యాటకమే కాదు.. పంటల్లోనూ మేటిగా నిలిచిన గండికోట ఇక్కడ పండిన నిమ్మకాయలు పొరుగు రాష్ట్రాలకు భారీగా ఎగుమతి

జమ్మలమడుగు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): పర్యాటక ప్రాంతమైన గండికోట నిమ్మపంటకు ప్రసిద్ధి చెందింది. , ఉద్యానవన పంటల్లో మంచి లాభదాయకంగా ఇక్కడ నిమ్మ పంటను రైతులు విస్తారంగా సాగుచేస్తారు. గండికోట పర్యాటక ప్రాంతమే అయినా నిమ్మసాగులోనూ పేరుగాంచింది. గ్రామంలో చుట్టుపక్కల అలాగే గండికోట కొట్టాలపల్లి గ్రామంలో నిమ్మతోటలు దర్శనమిస్తాయి. కొండ ప్రాంతమైనప్పటికి నిమ్మసాగును ఒక్కో రైతు వేలల్లో సాగు చేస్తారు. ప్రస్తుతం జమ్మలమడుగు మండలంలోని గండికోటలో సుమారు 500 ఎకరాల్లో నిమ్మసాగు చేసినట్లు రైతుల ద్వారా తెలుస్తోంది. గండికోట పరిధిలోని కొట్టాలపల్లెకు ప్రధాన జీవనాధారం నిమ్మసాగు. అక్కడున్న రైతులు అనేక మంది నిమ్మ పంట సాగు చేసి జమ్మలమడుగు పట్టణంలో 12 కి.మీ. దూరంలో నివాసం ఉంటూ ప్రతిరోజు తోటలో వెళ్లి కూలీలను పిలుచుకుని నిమ్మకాయలను వేరుచేసి బయటి ప్రాంతాలకు తరలిస్తున్నారు.

గండికోట నిమ్మ ముంబై, బెంగళూరుకు ఎగుమతి

మండలంలోని గండికోట ప్రాంతం నుంచి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బస్తాలలో నిమ్మకాలు తెచ్చి ముద్దనూరు రోడ్డులో నుంచి లారీలు, ట్రాక్టర్లలో ముంబై, బెంగళూరుకు భారీగా ఎగుమతి చేస్తుంటారు. సాగు చేసిన నిమ్మతోటలలో భారీగా ఖర్చు చేసినా వలం వేసవి కాలంలోనే రెట్టింపు ఆదాయం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ప్రతిరోజు జమ్మలమడుగు పట్టణంలోని గండికోటకు వెళ్లే దారి నుంచి లారీలు, ముంబై, బెంగుళూరు, బళ్లారి, కడప, ప్రకాశం జిల్లా తదితర ప్రాంతాలకు తరలిస్తారు. అలాగే సమీప గ్రామాల్లో కొన్ని నిమ్మకాయల బస్తాలను రైతులు వ్యాపారస్థులకు విక్రయించడంతో రాత్రి సమయాల్లో ట్రాక్టర్లలో తీసుకొస్తారు. ప్రస్తుతం ధరలు అంతంత మాత్రంగా ఉన్నాయని, 40 కేజీల నిమ్మకాయల బస్తా గత నెలలో 1200 నుంచి రూ.1600 వరకు ఉండేదని, మార్చి నెలలో రూ.2,200లకు వచ్చిందని, ఏప్రిల్‌ నెలలో అమాంతం భారీగా ధరలు పెరుగుతాయని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా జమ్మలమడుగులో ప్రతిరోజు గండికోట, గండికోటకొట్టాలపల్లి గ్రామాల్లో నిమ్మకాయలు బయటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.

Updated Date - Mar 13 , 2025 | 11:54 PM