ఆరోగ్యకేంద్రం నిర్మాణం అంతేనా..?
ABN , Publish Date - Jul 03 , 2025 | 11:48 PM
గత వైసీపీ హయాంలో అడ్డగోలు నిర్ణయాలతో అభివృద్ధి పడకేసింది.

అర్ధాంతరంగా నిలిచిన భవన నిర్మాణం
పూర్తయితే 10 గ్రామాలకు ప్రయోజనం
వైద్య శాఖా మంత్రి చొరవ తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి
దువ్వూరు, జూలై 3(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ హయాంలో అడ్డగోలు నిర్ణయాలతో అభివృద్ధి పడకేసింది. అరకొర నిధులు అభివృద్ధి పనులకు కేటాయించడంతో పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఆ తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిచేసుకుంటూ అభివృద్ధి పనులను గాడిన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు నిదర్శనంగా దువ్వూరు మండలంలోని చింతకుంట వద్ద రూ.2.50 కోట్లతో చేపట్టిన ప్రభుత్వ ఆరోగ్య కేంద్ర భవనం ఇప్పటికి పూర్తికాకపోవడంతో ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. అసలు ఈ భవనాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ చొరవ తీసుకోవాలని ఈ ప్రాంతవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అనుగుణంగా చింతకుంట వద్ద మరో ఆరోగ్య కేంద్రంను నిర్మించ తలపెట్టారు. ఇందుకొరకు రూ.2.50 కోట్ల నిధులు కేటాయించి పనులు మొదలు పెట్టారు. పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దాదాపు 40 శాతం పనులు జరిగినట్లు తెలుస్తోంది. దీని నిర్మాణం పూర ్తయితే ఇక్కడ ప్రధాన వైద్యుల ఏర్పాటుతోపాటు ఎనిమిది మంది ఇతర సిబ్బందిని నియమించి పూర్తిసాయి సేవలు అందించే ఏర్పాటు జరిగే అవకాశం ఉంది. తద్వారా చింతకుంట, మీర్జఖాన్‌పల్లె, రామాపురం, సి.బయనపల్లె, బుక్కాయపల్లె, జడ్జికొట్టాలు, హుస్సేనయ్య దర్గా, బీమునిపాడు, అన్నపుశాసు్త్రలపల్లి తదితర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు పది నెలలుగా ఈ పనులు నిలిచిపోవడం ఈ ప్రాంతవాసులను కలచివేస్తోంది. ఆర్‌అండ్‌బీ శాఖ నిధులతో చేపట్టిన ఈ పనులను పూర్తి చేసి ఆస్పత్రి నిర్మాణం జరుపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
భవన నిర్మాణం పూర్తికి చొరవ తీసుకుంటాం
చింతకుంట వైద్య ఆరోగ్య శాఖ భవనం పూర్తి చేయించేందుకు చొరవ తీసుకుంటాం. చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదనే కారణంతో కాంట్రాక్టర్ మిగతా పనులు పూర్తి చేయలేదు. మా శాఖ ఉన్నతాధికారులు పనులను పూర్తి చేయించాలని సూచించారు. పది రోజుల్లో తిరిగి మిగతా పనులు మొదలు పెట్టి వాటిని పూర్తి చేయిస్తాం.
- రామక్రిష్ణారెడి ్డ, ఆర్‌అండ్‌బీ ఏఈ, ప్రొద్దుటూరు