భారీ వర్షం.. వీధులు జలమయం
ABN , Publish Date - May 18 , 2025 | 11:53 PM
జమ్మలమడుగు పట్టణంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు వీధులు జలమయమయ్యాయి.
జమ్మలమడుగు, మే 18 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగు పట్టణంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు వీధులు జలమయమయ్యాయి. కాగా వర్షంతో శ్రీ నారాపురం వెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 7.30 గంటల నుంచి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (పీఆర్ మైదానం)లో బండలాగుడు పోటీలకు తీవ్ర అసౌకర్యంగా కలిగింది. దీంతో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకులు సింగంరెడ్డి నాగేశ్వరరెడ్డి, నవనీశ్వరరెడ్డి తదితరులు ఆ ప్రాంతంలో మట్టి చల్లించి ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయినా కొన్నిచోట్ల వర్షపునీరు నిలిచి ఇబ్బందులు కలిగాయి.
ఎర్రగుంట్లలో: ఎర్రగుంట్లలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి ఎర్రగుంట్ల నగరపంచాయతీలోని పలువీధులు జలమయమై ప్రజలకు తీవ్ర ఇబ్బందు లు కలిగాయి. వర్షపునీటితో వీధుల్లో నడవాలంటేనే పాదాచారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. మోకాటిలోతు వర్షం నీటితో వృద్ధులు, చిన్నారులు వీధుల్లోకి వెళ్లాలంటే నరకప్రాయంగా ఉండింది. అధికారులు వెంటనే స్పందించి పట్టణంలో వర్షపు నీరు వెళ్లేందుకు శాశ్వత పరిష్కారంగా డ్రైన్లు నిర్మించాలని కోరుతున్నారు. కాగా ఎర్రగుంట్లలో గత నాలుగు రోజులగా వర్షం కురుస్తోంది. 17వ తేదీన 23.4 ఎంఎంల వర్షపాతం నమోదు అయ్యింది. మేనెలలో కురవాల్సిన సగటు వర్షపాతం 27ఎంఎంలు మాత్రమే. అయితే ఈ సంవత్సరం అంతకంటే రెట్టింపు వర్షం కురిసింది. గత 20రోజులు తీవ్ర వేసవితాపానికి ప్రజలు గురయ్యారు. అయితే నాలుగురోజులు గా కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వేసవి దుక్కులు దున్ను కునేందుకు ఈ వర్షం ఉపయోగపడుతుందని రైతులు పేర్కొంటున్నారు.
కొండాపురంలో: మండలంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జామున కురిసిన వర్షానికి రైతుల్లోను, ప్రజల్లోను హర్షం వ్యక్తం అవుతోంది. మండలంలో 32.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వర్షంతో మండలంలో పలుచోట్ల వాగులు, వంకలు పొర్లి ప్రవ హించాయి. పలుచోట్ల రోడ్లన్నీ జలమయ్యమయ్యాయి. వాగులు, వంకల ద్వారా గండికోట ప్రాజెక్టులోకి వర్షపు నీరు వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు. సరైన సమయంలో వర్షం కురియడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు వేసవితాపంతో అల్లడుతున్న జనానికి వర్షం వల్ల ఉపశమనం లభించిదని చెప్పవచ్చు.
దువ్వూరులో: దువ్వూరులో శనివారం రాత్రి వర్షం పడింది. మూడు రోజులుగా వర్షాలు పడుతుండడంతో రైతులు ఆనందపడుతున్నారు. పంట ఆరబెట్టుకున్న కొందరు రైతులు మాత్రం డీలా పడుతున్నారు. ఈ ప్రాంతంలో 26.4 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. కొన్ని గ్రామాల పరిధిలో రోడ్ల వెంట వర్షపునీరు నిలిచి ప్రజలకు ఇబ్బంది ఏర్పడింది.
చాపాడులో: మండలంలో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బలమైన గాలులు వీచడంతో కొన్ని చోట్ల కరెంటు తీగెలు తెగి కిందపడ్డాయి. లక్ష్మిపేట గ్రామంలో రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇంటిపైన రెండవ అంతస్థుపై పిడుగు పడడంతో కొద్దిభాగం బండచప్పట దెబ్బతిన్నట్లు గ్రామస్థులు తెలిపారు. వర్షం రావడం, చల్లని వాతావరణం ఏర్పడడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది.