దళారుల చేతిలో ధాన్యం రైతు దగా
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:31 PM
దళారుల చేతిలో వరి ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
బస్తా రూ.1700 ఉన్న ధర రూ.1300 తగ్గిన వైనం
తీవ్రంగా నష్టపోతున్నామంటున్న వరి రైతులు
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ వేడుకోలు
పోరుమామిళ్ల, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): దళారుల చేతిలో వరి ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టించి పనిచేసి రేయిం బవళ్లు పంటను కంటికి రెప్పలా కాపాడుకుని చివరికి ఇంటికి చేర్చుకునేంత వరకు రైతుల కష్టాలు వర్ణించలేనివి. వ్యవసాయాన్ని నమ్ముకుని పంటలు సాగు చేసిన రైతన్నలకు చివరికి కష్టాలు, కన్నీళ్లే తప్ప కష్టానికి తగ్గ ఫలితం లభించలేదు. మార్కెట్లో ఒకసారి ఉన్న ధర ఉన్నట్లుండి పడిపోవడంతో ఆ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పోరుమామిళ్ల మండలంలో దాదాపు 2వేలకు పైగా వరి పంట సాగు చేశారు. పోరుమామిళ్ల, దమ్మన పల్లె, చల్లగిరిగెల, క్రిష్ణంపల్లె, రంగసముద్రం, టేకూరుపేట, అక్కల్‌రెడ్డిపల్లె, రంగసముద్రం విభవరం, క్రిష్ణంపల్లె ప్రాంతాలతో పాటు చాలా గ్రామాల్లో వరిని సాగు చేశారు. దాదాపు కొంత మంది 80 కేజీలు రూ.1700లకు అమ్ముకున్న రోజులున్నాయి. ప్రస్తుతం 80 కేజీలు ధర రూ.1300, రూ.1350 పలకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నట్లుండి ఒక్కసారిగా 80 కేజీలు బస్తా రూ.300, రూ.400 తేడా ఏంటని ప్రశ్నించినా కొనుగోలుదారు లను దళారులు ఎక్కి రానీయకపోవడం, మీ ఇళ్లల్లోనే నిల్వ ఉంచుకోండి అని ఖరాఖండిగా చెప్పడంతో వ్యవసాయానికి తెచ్చిన అప్పులు చెల్లించాల్సి రావడంతో కనీసం అప్పులైనా తెచ్చుకుందామని రైతులు అమ్మకాలు మొద లుపెడుతున్నారు. మరికొందరు పెట్టుబడులు, కౌలుకు పోను తమ చేతికి ఏమీ రాలేదని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఎకరాకు దాదాపు 40 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని భావిస్తే చాలా మంది రైతులకు 30 క్వింటాళ్లే దిగుబడి వచ్చింది. మైదుకూరు ఏరియాలో క్వింటా వరి మంచి ధర పలుకుతుందని దాదాపు రూ.2వేలు ధర పలుకుతున్నారని కొందరు రైతులు చెబుతున్నారు. కానీ పోరుమామిళ్ల ప్రాంతంలోనే ఇంత తక్కువగా ధర నిర్ణయించడం ఏమిటంటున్నారు. చాల మంది రైతులు రోడ్ల పక్కన అమ్మకాలకు రాశులుగా పోసుకున్నారు. కనీసం వరి పండించిన రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని వాపోతున్నారు.
దిగుబడి తగ్గి ఽధాన్యానికి గిట్టుబాటు ధరలేక ఇక్కట్లు
నాలుగు ఎకరాల్లో దాదాపు రూ. ఒక లక్ష 20వేలు పెట్టుబడి పెట్టి వరి సాగు చేస్తే తక్కువ దిగుబడి వచ్చింది. ఎకరాకు 40 బస్తాలు దిగుబడి రావాల్సి ఉండగా 30 క్వింటాళ్లే దిగుబడి వచ్చింది. 80కేజీలు బస్తా రూ.1700 ఉన్న ధర ప్రస్తుతం రూ.1300, రూ.1350 ధర పలుకుతుంది. అంతేకాక కొంత కౌలుకు భూమి చేసుకోవాల్సి వచ్చింది. ఇంత చేసిన కష్టానికి తగ్గ ఫలితం రాలేదు. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.
- లాయం రాముడు, తంబాబావివీధి
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
ప్రభుత్వం జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. రాష్ట్రమంతటా వరి కొనుగోలు కేంద్రాలు ఉండడంతో అక్కడ రైతులందరికీ కనీసం ధర లభిస్తుంది. కానీ కడప జిల్లాలో మాత్రం దళారుల మాటే వేదంగా మారడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కావున ప్రభుత్వం స్పందించి గతంలో మాదిరిగా జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తే జిల్లాలో వరి సాగు చేసిన రైతులకు కొంత మేరకైనా ఊరట లభించే అవకాశం ఉంది.
- బ్రహ్మయ్య, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు , దమ్మనపల్లె