రైతులు పండ్లతోటలు సాగు చేయాలి
ABN , Publish Date - Jul 08 , 2025 | 11:52 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పండ్ల తోటలు సాగు చేసే రైతులకు సబ్సిడీ ఇస్తు న్నందున ఆసక్తిగల రైతులు పండ్లతోటలు సాగు చేసుకోవాలని మైదుకూరు శాసనసభ్యుడు పుట్టాసుధాకర్‌యాదవ్ సూచించారు.
ఖాజీపేట, జూలై 8 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పండ్ల తోటలు సాగు చేసే రైతులకు సబ్సిడీ ఇస్తు న్నందున ఆసక్తిగల రైతులు పండ్లతోటలు సాగు చేసుకోవాలని మైదుకూరు శాసనసభ్యుడు పుట్టాసుధాకర్‌యాదవ్ సూచించారు. మంగళవారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మండల పరిధికి 70 ఎకరాల్లో పంటలు సాగు చేసుకునే అవకాశం ఉందని, అయితే 21 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారన్నారు. అనంతరం పండ్ల తోటల పెంపకంలో పాల్గొన్న కూలీలతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి గ్రామంలో పశువుల కోసం నిర్మిస్తున్న నీటి తొట్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. పత్తూరు పంచాయతీలోని నాగపట్నంలో ఉపాధి హామీ పథకంలో నిర్మించిన నీటి తొట్టిని ప్రారంభించారు. కాగా కూనవారిపల్లె, నాగపట్నం గ్రామ ప్రజలు కడప-కర్నూలు జాతీయ రహదారిలో ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాన్ని ఎమ్మెల్యేకు చూపించి రోజు ఏదో ఒక సంఘటన జరుగుతూ ప్రాణాలు కోల్పోతున్నామని పరిష్కారం చూపాలని విన్నవించుకున్నారు. ఎంపీడీవోను ఆ సమస్యను పరిష్కరించేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు లక్ష్మిరెడ్డి, నంద్యాల సుబ్బయ్య, ప్రతాప్‌రెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి, హరినాథరెడ్డి, పుల్లయ్యనాయుడు,గంగినాయుడు, మురళి, క్రిష్ణారెడ్డి, రామసుబ్బయ్య, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.
ప్రొద్దుటూరు రూరల్‌లో: రైతులు పండ్ల తోటల సాగుపై ఆసక్తి చూపితే అధిక దిగుబడులు సాధించవచ్చని మాజీ ఎంపీపీ నంధ్యాల రాఘవరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉపాధి హామీ నిధులతో మండల పరిదిలోని చెన్నమరాజుపల్లె గ్రామంలో ఉద్యాన పంటల సాగులో భాగంగా టెంకాయ మొక్కలను నాటారు. చెన్నమరాజుపల్లెకు చెందిన రైతు మల్లికార్జున పొలంలో ఒకటిన్నర ఎకరా విస్తీర్ణంలో సుమారు 50 మొక్కలను నాటారు. పంట సాగులో భాగంగా మూడేళ్ల కాలపరిమితిలో ఉపాధి హామీ నిధుల కింద వంద రోజుల పనిదినాలతోపాటు రూ.1.45 లక్షలను కేటాయించనున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో సూర్యనారాయణరెడ్డి, ఉపాధి ఏపీవో మహేశ్వరరెడ్డి, ఈసీ విజయకుమార్‌రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్లు, రైతులు పాల్గొన్నారు.