కాకిరేణిపల్లెలో అన్నీ సమస్యలే..!
ABN , Publish Date - Jul 23 , 2025 | 12:14 AM
ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని శివారు ప్రాంతమైన కాకిరేణిపల్లె సమస్యలతో సతమత మవుతోంది.
ప్రొద్దుటూరు రూరల్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని శివారు ప్రాంతమైన కాకిరేణిపల్లె సమస్యలతో సతమత మవుతోంది. పేరుకే ఇది గ్రామ పంచాయతీ అ యినా కనీస సౌకర్యాలు నోచుకోకపోవడం శోచనీ యం. మండల పరిధిలోని కాకిరేణిపల్లె గ్రామంలో దాదాపు 250 ఇళ్లు ఉండగా వెయ్యి మందికిపైగా జనాభా ఉన్నారు. ఇక్కడ తలెత్తే సమస్యలకు అధికారులు తూతూ మంత్రపు చర్యలు తప్పనిచ్చి గట్టి పరిష్కారమార్గాలు చూపకపోవడంతో నిత్యం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. గ్రామానికి ప్రధానంగా నీటి సరఫరా అయ్యే పైపులైను చౌడూరు-కాకిరేణిపల్లె మార్గమధ్యంలో పొలాల మధ్యలో లీకేజీలకు గురవుతూనే ఉంది. వర్షాకాలంలో తాగునీరు పైపు లీకేజీతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు వాపోతున్నారు. గత నాలుగు నెలలుగా తరచూ ఇలాంటి సమస్య ఎదురవుతున్నప్పటికి పరిష్కార చర్యలు అధికారులు చూపడంలేదని గ్రామస్థులు వాపోతున్నారు. అసలు గ్రామ పంచాయతీ అధికారుల జాడ కనిపించడంలేదని కాకిరేణిపలె ్ల సచివాలయ సిబ్బంది చౌడూరు సచివాలయంలో ఉండ డంతో ఇక్కడి సమస్యలపై దృష్టి కేంద్రీకరించేవారు కరువయ్యారని వాపోతున్నారు. సుమారు నెల రోజులుగా కాకిరేణిపల్లి ప్రధాన రహదారిలో రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలుగక గ్రామం అంధకారంలో ఉంది. చీకటి పడగానే విషపురుగులు, కీటకాల సంచారంతో భయం గుప్పిట్లో ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. చినుకుపడితే గ్రామం మొత్తం చిత్తడిలా తయారవుతుందని పేర్కొన్నారు. మురుగు వ్యవస్థలేని ఈ గ్రామంలో వెయ్యి మంది జనాబాకు ఇద్దరు పారిశుధ్య కార్మికులు ఏ మేరకు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచగలరని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.
సమస్యలను సత్వరం పరిష్కరిస్తాం
గ్రామానికి సరఫరా అయ్యే మంచినీటి పైపులైను లీకేజీ తమ దృష్టిలో ఉంది. మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం. వెలుగని వీధి దీపాలను ఇటీవలే కొత్త బల్బులు అమర్చాం. గాలులు, వర్షాలధాటికి లూజ్ కాంట్రాక్టు వలన విద్యుత్తు సరఫరాలో సమస్య తలెత్తుతోంది. సంబందిత అధికారులద్వారా తగిన చర్యలు తీసుకుంటాం.
- ఎం.రాజేశ్వరి, పంచాయతీ కార్యదర్శి