మారని వైద్యులు.. కష్టాల్లో రోగులు
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:50 PM
జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు ఉన్నా లేనట్లేనని రోగులు వాపోతున్నారు.
జమ్మలమడుగు ప్రభుత్వాస్పత్రి వైద్యులు తీరుమార్చుకోకపోవడంతో రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని మండలాల నుంచి ప్రతిరోజూ వందల సంఖ్యలో రోగులు వైద్యం కోసం ఆస్పత్రికి వస్తుంటారు. అయితే వైద్యులు సకాలంలో అందుబాటులో ఉండకపోవడంతో గంటలతరబడి రోగులు వేచిచూడాల్సి వస్తోంది. కొందరు విధిలేని పరిస్థితుల్లో వెనుతిరిగి వెళ్లాల్సివస్తోంది. ఇలా అనేక సందర్భాల్లో ఘటనలు చోటుచేసుకోవడం స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు జిల్లా ఉన్నతాధికారులు హెచ్చరించినా వైద్యుల మాత్రం మారడంలేదు. ఇకనైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు మందలించినా తీరుమార్చుకోని వైద్యులు వైద్యం కోసం గంటల తరబడి రోగుల పడిగాపులు
జమ్మలమడుగు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు ఉన్నా లేనట్లేనని రోగులు వాపోతున్నారు. వారు సమయపాలన పాటించడంలేదని దీంతో తాము తీవ్ర ఇక్కట్లుపడుతున్నామని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ప్రభుత్వ ఆస్పత్రిలో 9 గంటలకు విధులకు హాజరుకావాల్సిన డాక్టర్లు ఇష్టారాజ్యంగా వస్తున్నారని పలువురు వాపోతున్నారు. శనివారం జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు డాక్టర్లకోసం క్యూ కట్టారు. కొందరు డాక్టర్లు వచ్చినా మరికొందరు హాజరుకాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆస్పత్రిని సందర్శించి ఆస్పత్రిలో సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. అదే రోజు రూ.5 లక్షలు అందజేశారు. అలాగే ఆస్పత్రిప్రాంగణంలో వర్షం వస్తే నీళ్లు ఆగేవని, వాటిని సైతం రోడ్డును వేసి ఎత్తు పెంచారు. సౌకర్యాలన్నీ కల్పిస్తే రోగులకు డాక్టర్లు ప్రతిరోజు సమయానికి వచ్చి నాణ్యమైన వైద్యం అందిస్తారని ఆశించినా ఫలితంలేకుండా పోతోంది. డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. కాగా శనివారం ఒక డాక ్టరు మాత్రమే విధుల్లో ఉండగా మిగతా వారు 9.40 గంటలకు కొందరు హాజరుకావడం, మరికొందరు రోగులను పరీక్షించకుండా ఆస్పత్రిలో వార్డుల్లో ఉన్నట్లుగా చెప్పడం రోగులకు ఇబ్బందికరంగా మారింది అలాగే రక్తపరీక్ష ల్యాబ్‌లో నలుగురు టెక్నీషియన్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఉన్నారని దీంతో రక్త పరీక్ష రిపోర్టులు ఆలస్యమవుతుండడంతో రోగులకు ఇదో పరీక్షలా మారిందని మండిపడుతున్నారు.ఇలాంటి తరుణంలో స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి డాక్టర్లపై, సిబ్బందిపై సమీక్ష సమావేశం నిర్వహించి నిర్లక్ష్యంగా వ్యవహరించే డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం వెంటనే ఆస్పత్రిని సందర్శించి డాక్టర్ల సమయపాలనకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రోగులకు సత్వర వైద్యమందేలా చూస్తా
ఈ సమస్యకు సంబందించి ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ రఫిక్‌పాషాను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా శనివారం తనకు కడపలో సమావేశం ఉన్నందున అక్కడికి వెళ్లానన్నారు. ఆస్పత్రి నుంచి కొందరు డాక్టర్లు రాలేదని తనకు కూడా ఫోన్ చేసినట్లు తెలిపారు. మరికొందరు వచ్చి వెళ్లినట్లు తెలిసిందన్నారు. సోమవారం ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి విధులకు రానివారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగుల కు సత్వర వైద్యమందేలా చూస్తామన్నారు.