ఆర్భాటమే తప్ప..ఆచరణ శూన్యం
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:56 PM
గత వైసీపీ హయాంలో ప్రచార ఆర్భాటమే తప్న.. ఆచరణ శూన్యమంటూ పలువురు పేర్కొం టున్నారు.
గత వైసీపీ హయాంలో లక్ష్యాలు నవ్వులపాలు
పాడిపరిశ్రమ కోసమంటూ
పాలవెల్లువ కేంద్రాలు
అలంకార ప్రాయంగా నిలిచిన భవనాలు
జాడలేని ఆర్థిక భరోసా
ప్రొద్దుటూరు రూరల్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ హయాంలో ప్రచార ఆర్భాటమే తప్న.. ఆచరణ శూన్యమంటూ పలువురు పేర్కొం టున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతులను ఆదుకునేందుకు పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పాలవెల్లువ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. అయితే పేరు బా గుంది కాని లక్ష్యమే నవ్వుల పాలవుతోంది. ప్రతి 2,500 పశువులకు ఒక క్లస్టర్‌గా విభజించి ప్రతి మండలానికి అయిదు నుంచి ఏడు క్లస్టర్టుగా లెక్కకట్టారు. పాడి రైతు మహిళా సాధికారతను బలోపేతం చేయడం కోసం జగనన్న పాల వెల్లువ మహిళా డెయిరీ సహకార సంఘం పేరున భవనాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. వాటిలో పాలశీతలీకరణ కోసం యంత్రాలు, పరికరాల కోసం చర్యలు చేపట్టారు. పాలవెల్లువ కేంద్రాల నిర్మాణం కోసం ఉపాధి హామీ నిధుల కింద ఒక్కోదానికి రూ.15 లక్షలు కేటాయించారు. అయితే స్థలం, నిధుల కొరత, ముందుకు రాని కాంట్రాక్టర్లు తదితర కారణాలతో బాలరిష్టాలను దాటలేదు. ముచ్చటగా రెండు మూడు భవనాలు నిర్మించారు. వాటిలో కూడా కొన్ని చోట్ల భవనాలు అసంపూర్తిగా మిగిలాయి. పూర్తయినవి అలంకారప్రాయంగా మారాయి. 1, 2 చోట్ల ప్రారంభించి మూత వేశారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌విడుదలకు ముందు పాలశీతలీకరణ పరికరాలు లేకుండానే భవనాలను ప్రారంభం చేపట్టి మమ అనిపించారు.
మాటలకే పరిమితం
లక్షల ఖర్చుతో నిర్మించిన ఈ కేంద్రాల వలన ఇసుమంత ప్రయోజనం లేకపోవడంతో గ్రామస్థులు మండిపడుతున్నారు. ప్రాథమిక సదుపాయాలు లేకపోవడంతో మూతపడిన పాల వెల్లువ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ప్రొద్దుటూరు మండల పరిధిలో 15 చోట్ల పాల వెల్లువ కేంద్రాలకు అప్పట్లో ఆమోదం లభించింది. అందులో కేవలం నంగనూరుపల్లి, తాళ్లమాపురంలో నిర్మాణాలు చేపట్టారు. రాజుపాళెం మండలంలో, అర్కటవేములలో నిధుల కొరతతో నిర్మాణాలు అసంపూర్తిగా వదిలేశారు. దువ్వూరు మండలం చిన్న సింగనపల్లి కట్టడం పూర్తికాగా గుడిపాడులో అసంపూర్తిగా నిలిచింది. యంత్రాలు, పరికరాల ఊసులేదు. వాటిని ఏమి చేయాలో, ఈ పథకాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలో అధికారులకే అర్థమవ్వని అయోమయమైన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం దీనిపై నిర్ధిష్టమైన కార్యాచరణ చేపట్టి వేలాది పాడి కుటుంబాలకు పాల అమ్మకాల్లో గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని పాడిరైతులు కోరుతున్నారు.
పశుసంవర్ధక శాఖ ఏడీ ఏమన్నారంటే..
ఈ పాల వెల్లువ కేంద్రాల నిర్వహణపై ప్రస్తుత ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి నిర్ధిష్ట ఆదేశా లు లేవని పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ ఆర్.ధనుంజయరెడ్డి పేర్కొన్నారు. పాడిపరిశ్రమ, పాలవెల్లువ కేంద్రాల ఏర్పాటుపై ఏడీని ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా పై విధంగా స్పందించారు.