Share News

కుదేలవుతోన్న టమోటా రైతు

ABN , Publish Date - May 19 , 2025 | 11:35 PM

టమోటా ధరలు గణనీయంగా పడిపోవడంతో పంట సాగు చేసిన రైతులు కుదేలవుతున్నారు. కాయలను మార్కెటుకు తీసుకువెళ్తే కూలీల డబ్బులు సైతం రావడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇక చేసేదేమి లేక పండిన టమోటా పంటను కొందరు రైతులు పొలాల్లోనే వదిలేస్తుండగా.. మరికొందరు రైతులు కాయలను రోడ్డు పక్కన పారబోస్తున్నారు. దిగు

కుదేలవుతోన్న టమోటా రైతు
ధరలు లేకపోవడంతో తంబళ్లపల్లెలో రోడ్డు పక్కన గుట్టలుగా పోసిన టమోటాలు

ధర లేక టమోటాలను రోడ్డు పక్కన పడేస్తున్న రైతులు

కూలీల ఖర్చులూ రాని వైనం

టమోటా ధరలు గణనీయంగా పడిపోవడంతో పంట సాగు చేసిన రైతులు కుదేలవుతున్నారు. కాయలను మార్కెటుకు తీసుకువెళ్తే కూలీల డబ్బులు సైతం రావడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇక చేసేదేమి లేక పండిన టమోటా పంటను కొందరు రైతులు పొలాల్లోనే వదిలేస్తుండగా.. మరికొందరు రైతులు కాయలను రోడ్డు పక్కన పారబోస్తున్నారు. దిగుబడులు బాగున్నా ధరలు పతనం కావడంతో లబోదిబోమంటున్నారు.

తంబళ్లపల్లె, మే 19 (ఆంధ్రజ్యోతి): మండలంలో వేరుశెనగతో పాటు టమోటాను ఎక్కువగా సాగు చేస్తారు. ప్రస్తుతం మండల వ్యాప్తంగా సుమారు 3000 ఎకరాలకు పైగా టమోటా సాగులో ఉందని అధికారుల అంచనా. గత ఏడాది చివరి వరకు టమోటా ధరలు ఆశాజనకంగానే ఉన్నా ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో 30 కేజీల బాక్సు ధర కాయల నాణ్యతను బట్టి రూ.40 నుంచి రూ.50 వరకు ఉందని టమోటా రైతులు చెబుతున్నారు. దున్నకం, నారు, కూలీలు, మందులు, రావాణా అన్నీ కలిపి ఎకరాకు సుమారు రూ.1.2 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి వస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం టమోటాకు ధర లేకపోవడంతో కాయలు కోసి మార్కెట్టుకు తీసుకువెళ్తే కూలీల డబ్బులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండలంలోని పరుసతోపు పంచాయతీ పేండేరివారిపల్లెకు చెందిన రైతు మల్లప్ప రెండు ఎకరాల్లో రూ.2.5 లక్షలు పైగా ఖర్చు చేసి టమోటా పంట సాగు చేశాడు. పంట దిగుబడి బాగా వచ్చింది. రైతు నాలుగు రోజుల కిందట కూలీలతో పంటను కోయగా రెండు ఎకరాల్లో సుమారు 160కి పైగా బాక్సులు కోతకు వచ్చాయి. కాయలను మార్కెట్టుకు తరలించగా 30 కేజీల బాక్సు ధర రూ.40 నుంచి 50 పలికింది. ఈ ధరతో కాయలు కోసిన కూలీలకు పెట్టిన ఖర్చు కూడా రాదని ఆగ్రహించిన రైతు కాయలను తీసుకువచ్చి గ్రామానికి సమీపంలోని రోడ్డు పక్కన కాలువలో పారబోశాడు. కాసుల వర్షం కురిపిస్తుందన్న టమోటా చివరకు కూలీల ఖర్చులు సైతం రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి టమాటాకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

అధిక దిగుబడులతో ధరలు పతనం

నిమ్మనపల్లి, మే 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రైతులు ఈ ఏడాది అధికంగా టమోట పంటలు వేయడంతో ధరలు పతనమయ్యాయి. హార్టికల్చర్‌ అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 700 హెక్టార్లలో టమోట పంట సాగైనట్లు తెలుస్తోంది. ఒక ఎకరా టమాట పంటను పండించాలంటే దాదాపు రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు రైతు ఖర్చు చేయాల్సి వుంటుంది. ప్రస్తుతం కలికిరి టమోట మార్కెట్‌లో 30 కేజీల టమాట ధర కేవలం రూ.50 పలికినట్లు రైతులు తెలిపారు. సరాసరి రెండు రోజుల క్రితం దాదాపు రూ.200 వున్న టమోట ధర నేడు రూ.50కి పడిపోవడంతో రైతులు డీలా పడ్డారు. కొందరు రైతులు ధర పతనం కావడంతో కాయలు కోయకుండా చెట్లలోనే వదిలేస్తున్నారు. దీనికి తోడు సాఫ్ట్‌వేర్‌, రిటైర్డ్‌, స్థానికంగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు సైతం వందల ఎకరాలను కొనుగోలు లేదా కౌలుకు తీసుకొని టమోట పంటలు పండిస్తుండడంతో సామాన్య రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ సారైనా ధరలు వుంటాయని వడ్డీలకు తెచ్చి ఖర్చు చేశారు. ఇదిలా వుంటే కోసిన కాయలను మార్కెట్‌కు తరలిస్తే కమీషన్‌, కూలీలు, బాడుగలకు పోయి ఒక్క పైసా కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. కొందరు రైతులు మాట్లాడుతూ.. ఈ సారి ధర కనీసం రూ.400ల కంటే తక్కువ పోతే ఆత్మహత్య చేసుకొంటామని చెబుతు న్నారు. ప్రభుత్వం నికర ధరను ప్రకటించి రైతులను ఆదుకొంటే తప్ప బాగుపడే పరిస్థితి కనిపించడం లేదు.

Updated Date - May 19 , 2025 | 11:35 PM