Kadapa MLA Madhavi: మళ్లీ కుర్చీ వివాదంలో కడప ఎమ్మెల్యే
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:44 AM
డప ఎమ్మెల్యే ఆర్.మాధవి మరోసారి కుర్చీ వివాదంలో ఇరుక్కున్నారు. కార్పొరేషన్‌లో మేయర్ పక్కన కుర్చీ వేయలేదంటూ ఆమె ఆందోళనకు దిగడం రాష్ట్రవ్యాప్తంగా..
స్వాతంత్య్ర వేడుక మొదలయ్యాక భర్తతోపాటు వచ్చిన మాధవి
వేదికపై కుర్చీవేసి రమ్మన్న జేసీ.. ఆమెపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం
కడప, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): కడప ఎమ్మెల్యే ఆర్.మాధవి మరోసారి కుర్చీ వివాదంలో ఇరుక్కున్నారు. కార్పొరేషన్‌లో మేయర్ పక్కన కుర్చీ వేయలేదంటూ ఆమె ఆందోళనకు దిగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్వాతంత్య్ర దిన వేడుకల్లో కూడా మరోసారి కుర్చీ వివాదం చోటుచేసుకుంది. కడప పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎండీ ఫరూక్ హాజరయ్యారు. ప్రొటోకాల్ ప్రకారం వేదికపై మంత్రి, కలెక్టర్, ఎస్పీ, జేసీ మాత్రమే ఆశీనులై ఉండాలి. అయితే ఎమ్మెల్యే మాధవి తన భర్త శ్రీనివాసరెడ్డితో కలిసి వేడుకలు ప్రారంభమైన తర్వాత వచ్చారు. ఎమ్మెల్యే వచ్చేప్పటికి వేదికపై ఆమె కోసం విడిగా కుర్చీ లేదు. నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ కుర్చీ వేసి వేదికపైకి రావాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె వెనక్కి వచ్చేశారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్వయంగా వెళ్లి వేదికపైకి రావాలని కోరగా.. థాంక్యూ కలెక్టరు గారూ అని మాధవి సమాధానమిచ్చారు. వేదికపైకి వెళ్లకుండా అక్కడే కాసేపు నిల్చుని వెళ్లిపోయారు.