జేఎన్‌వీ ప్రవేశ పరీక్షలకు.. దరఖాస్తు విద్యార్థులు 1,660 గైర్హాజరీలు 1,169 మంది
ABN , Publish Date - Feb 09 , 2025 | 01:05 AM
పెదవేగి జవహర్ నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)లో 9, 11వ తరగతు ల్లోకి అందుబాటులోవున్న సీట్లను భర్తీ చేసేందుకు శనివారం ప్రవేశపరీక్షలు జరిగాయి.
ఏలూరు అర్బన్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : పెదవేగి జవహర్ నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)లో 9, 11వ తరగతు ల్లోకి అందుబాటులోవున్న సీట్లను భర్తీ చేసేందుకు శనివారం ప్రవేశపరీక్షలు జరిగాయి. ఏలూరు, పెదవేగిల్లోని ఆరు కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు 9వ తరగతి ప్రవేశాలకు 1,007 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 302 మంది, 11వ తరగతి ప్రవే శాలకు 653 మంది దరఖాస్తు చేసుకోగా 189 మంది హాజర య్యారు. మొత్తంమీద ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 1660 మంది విద్యార్థుల్లో కేవలం 491 మంది మాత్రమే హాజరు కాగా, ఏకంగా 1169 మంది గైర్హాజరు కావడానికి ఆయా తరగ తుల్లో సీట్ల ఖాళీలు పెద్దగా ఉండకపోవడమేనని చెప్పవచ్చు. పెదవేగి జేఎన్‌వీలో వచ్చే విద్యాసంవత్సరానికి (2025–26) 9వ తరగతిలో ఏడు సీట్లు అందుబాటులో ఉండగా, సంబంధిత సీట్లను మెరిట్ ప్రకారం రిజర్వేషన్ వర్గాల విద్యార్థులతో మాత్రమే భర్తీ చేయా ల్సి ఉంటుంది. ఇక 11వ తరగతిలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల్లో సహతుక కారణాలపై ఎవరైనా టీసీ తీసుకుంటేనే ఆ మేరకు భర్తీ జరుగుతుంది. ఇలా ఏర్పడే ఖాళీలను సైతం భర్తీ చేయడానికి తొలి ప్రాధాన్యత ట్రిపుల్ ఐటీలో సీటురాని వారికి, కేంద్ర ప్రభుత్వ దక్షిణ భారత టెస్టులో ఉత్తీర్ణులైన వారికే ఉం టుంది. వచ్చే విద్యాసంవత్సరానికి పెదవేగి జేఎన్‌వీలో 11వ తరగతిలో ఇంతవరకు ఒక్కసీటూ ఖాళీలేదు. ఈ కారణాలతో దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యధికులు గైర్హాజరవుతుంటారని జిల్లావిద్యా శాఖ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఏప్రిల్‌లో ఫలితాలను వెల్లడిస్తారు. పెదవేగి జేఎన్‌వీ ప్రిన్సిపాల్ సీతాలక్ష్మి, డీఈవో వెంకటలక్ష్మమ్మ పరీక్ష కేంద్రాలను సందర్శించారు.