Visakhapatnam: మీ జైలర్ మహిళను వేధించాడు
ABN , Publish Date - Apr 11 , 2025 | 06:37 AM
విశాఖ గృహిణికి అసభ్యంగా మెసేజ్‌లు పంపిన అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదై, జైళ్ల శాఖ డీజీకి సీపీ లేఖ రాశారు
న్యూడ్ కాల్ చెయ్యమని ఒత్తిడి చేశాడు
జైళ్లశాఖ డీజీకీ విశాఖ సీపీ లేఖ
ఆచూకీ తెలపాలని విజ్ఞప్తి
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ‘బాత్ రూమ్‌కు వెళ్లు.. న్యూడ్ కాల్ చెయ్యి.. 20 వేలిస్తా.. 30 వేలిస్తా..’ అంటూ విశాఖపట్నంలోని ఓ గృహిణికి అసభ్య సందేశాలు పంపిన అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి ఆచూకీ తెలపాలంటూ జైళ్ల శాఖ డీజీకి విశాఖ నగర పోలీసు కమిషనర్ లేఖ రాశారు. వైజాగ్‌లో కేసు నమోదైనట్టు తెలియగానే పరారైన జైలర్ సీవీఎన్ సుబ్బారెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ వ్యవహారం జైళ్లశాఖలో చర్చనీయాంశమైంది. ఆరేళ్ల క్రితం ఒక ఫేస్ బుక్ ఖాతాకు జైలర్ సుబ్బారెడ్డి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. పదేపదే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతుండటంతో ఆమె భర్త సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో తాను విశాఖపట్నంలో జైలర్‌నని, కేవలం స్నేహం కోసమే రిక్వెస్ట్ పంపానంటూ సారీ చెప్పి రిక్వె్‌స్టలు పంపడం ఆపేశాడు. గత నెల 25న మళ్లీ ఆ గృహిణికి ఫోన్ చేసి న్యూడ్ కాల్ చెయ్యాలంటూ ఒత్తిడి చేశాడు. విశాఖపట్నం సైబర్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆరా తీయగా సుబ్బారెడ్డి అనంతపురంలో జైలర్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది. విచారణకు హాజరుకావాలంటూ ఫోన్ చెయ్యడంతో ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో విశాఖ సీపీ జైళ్ల శాఖ ఇన్‌చార్జి డీజీకీ లేఖ రాయడం చర్చనీయాంశమైంది.