NCLT: ఆస్తుల వివాదంలో జగన్ వర్సెస్ విజయమ్మ.. తీర్పు రిజర్వ్
ABN , Publish Date - Jul 15 , 2025 | 07:08 PM
వైఎస్ జగన్, వైఎస్ భారతీలు బోర్డు ఆఫ్ డైరెక్టర్లు.. తమ తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాత.. కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదంటూ ఎన్‌సీఎల్‌టీ ముందు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వీరి వాదనలు విన్న ఎన్‌సీఎల్‌టీ తీర్పును రిజర్వు చేసింది.
హైదరాబాద్, జులై 15: ఆస్తుల వివాదంపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్లపై మంగళవారం విచారణ పూర్తయింది. ఆస్తుల వ్యవహారంలో వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఆస్తుల వివాదంపై ఎన్‌సీఎల్‌టీని వైఎస్ జగన్ ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఎన్‌సీఎల్‌టీ.. తన తీర్పును రిజర్వు చేసింది. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ వాటాల వ్యవహారంలో వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ సాగింది. అనంతరం ఈ కేసులో తీర్పును ఎన్‌సీఎల్‌టి రిజర్వు చేసింది.
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో తల్లి విజయమ్మకు వాటా అప్పగించారు. తిరిగి ఆ వాటను తమకు అప్పగించాలంటూ వైఎస్ జగన్.. తన పిటిషన్‌లో కోరారు. అందుకు సంబంధించి వాదనలు సైతం వినిపించారు. అలాగే సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ న్యాయవాది, వైఎస్ జగన్ తరఫు న్యాయవాది, వైఎస్ షర్మిల తరఫు న్యాయవాది తమ తమ వాదనలు వినిపించారు. అయితే చట్టప్రకారం వాటాలు బదలాయించిన తర్వాత.. తిరిగి మళ్లీ ఆ వాటను తనకు అప్పగించాలంటే.,. ఇరు వైపులా అంగీకారం ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని ఎన్‌సీఎల్‌టీ దృష్టికి న్యాయవాదులు తీసుకు వెళ్లారు. ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన వాటాలను తల్లికి వైఎస్ జగన్ ఇచ్చిన అనంతరం వాటిని తిరిగి అడిగే హక్కు లేదంటూ ఆ సంస్థ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.
ఒక్కసారి వాటాలను అప్పగించాక.. కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు అటు వైఎస్ జగన్‌కు కానీ.. ఇటు వైఎస్ భారతీకి కానీ ఎలాంటి హక్కులు లేవని సరస్వతి సంస్థ న్యాయవాది కోర్టులో వాదించారు. మరోవైపు గిఫ్ట్ ఇచ్చాక ఏకపక్షంగా అవగాహన ఒప్పందం రద్దు కుదరదంటూ వాదనలు సైతం ఈ సందర్భంగా నడిచాయి. ఇంకోవైపు విజయమ్మ తరఫు న్యాయవాది సైతం తన వాదనలు బలంగా వినిపించారు. ఎన్‌సీఎల్‌టీ సెక్షన్ 59 కింద పిటిషన్ వేసి వివాదం చేయడంలో వైఎస్ జగన్‌ది కుటిల పన్నాగమంటూ స్పష్టం చేశారు.
వైఎస్ జగన్, వైఎస్ భారతీలు బోర్డు ఆఫ్ డైరెక్టర్లు.. తమ తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాత.. కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదంటూ ఎన్‌సీఎల్‌టీ ముందు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వీరి వాదనలు విన్న ఎన్‌సీఎల్‌టీ తీర్పును రిజర్వు చేసి ఉంచింది. ఈ వివాదంలో దాదాపు 4 నుంచి 5 నెలలుగా విచారణ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును ఎప్పుడు వెల్లడిస్తుందనేది ఎన్‌సీఎల్‌టీ తెలపలేదు.