Payyavula Keshav: నరుకుతామంటే.. సంతోషమంటారా
ABN , Publish Date - Jun 20 , 2025 | 05:15 AM
జగన్, వైసీపీ ఆలోచనలు చూస్తుంటే.. రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు. పెట్టుబడులు రాకూడదు. ప్రజలు ప్రశాంతం ఉండకూడదు’ అన్నట్లుందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. రౌడీలంతా నా వెనుక నడవండి..
సమాజానికి జగన్ ఏం చెప్పదలుచుకున్నారు?
సొంత బాబాయి విగ్రహాన్ని పెట్టించలేదేం!
అరాచకం, విధ్వంసం చేయాలని చూస్తే ఊరుకోం: పయ్యావుల
అమరావతి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): ‘జగన్, వైసీపీ ఆలోచనలు చూస్తుంటే.. రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు. పెట్టుబడులు రాకూడదు. ప్రజలు ప్రశాంతం ఉండకూడదు’ అన్నట్లుందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. రౌడీలంతా నా వెనుక నడవండి.. నాయకత్వం వహిస్తా అన్నట్లు జగన్ తీరుందని విమర్శించారు. చంద్రబాబు చాలా ఓర్పు, సంయమనంతో ఉన్నారు కదా అని అరాచకం, విధ్వంసం చేయాలని చూస్తే.. చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గురువారం అమరావతి సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని హౌస్ అరె్‌స్టలు, తప్పుడు కేసులతో భయపెట్టాడు. అధికారం పోయాక తనంటే భయం పోతోందని పర్యటనల ద్వారా రాష్ట్రంలోని రౌడీల్ని, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, బెట్టింగ్ బ్యాచ్‌లను జగన్ సమీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. రప్పారప్పా నరుకుతామనటానికి ఇది సినిమా కాదు. తన అరాచక పాలనను ప్రజలు రప్పారప్పా అని నరికేశారు. జగన్ ఓటమి నుంచి పాఠం నేర్చుకోవడం లేదు. ఎందుకు ఓడిపోయామనే ఆలోచన లేదు. నరికేస్తామంటే ఖండించాల్సింది పోయి.. సంతోషిస్తానంటారా? సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? వార్ డిక్లేర్ అనడం హింసను ప్రేరేపించడం కాదా! ఎవర్ని నరుకుతారు మీరు? ప్రజలనా? ప్రజాస్వామ్యాన్నా? రాజకీయ నాయకుడు ఓటమి తర్వాత సమీక్ష చేసుకోవాలి. మార్పు చెందాలి. కానీ, జగన్‌లో ఏ మార్పూ కనబడటం లేదు. తెనాలి పోయి 10 కేసులున్న రౌడీషీటర్‌ని పరామర్శించారు. ఆ కేసులు వైసీపీ పాలనలో పెట్టినవే. పొదిలిలో రైతుల పరామర్శ పేరుతో అరాచకం చేశారు. బెట్టింగ్‌లతో చనిపోయిన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. తన పర్యటనలో ఇద్దరు చనిపోతే ఏమీ పట్టించుకోలేదు.
మరి సొంత బాబాయి చనిపోతే.. విగ్రహాన్ని పెట్టించలేదేం? విగ్రహాలతో రాజకీయం చేసే చరిత్ర జగన్‌ది. మేమూ మీలా చేయాలనుకుంటే బెంగళూరు ప్యాలెస్ నుంచి ఏపీలో అడుగు పెట్టేవారా? పవన్‌కల్యాణ్‌ను హైవే మీద, చంద్రబాబును ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న విషయాలు మర్చిపోయారా? చంద్రబాబు ప్రభుత్వం ఉండబట్టే.. జగన్ రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాడు. సొంత చెల్లిపైనే నిఘా పెట్టిన జగన్.. ప్రభుత్వ ఉద్దేశాన్ని పట్టించుకుంటాడనేది భ్రమే. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే జగన్‌కు కడుపుమంట. ఇలాంటి దుర్మార్గ ఆలోచనలు సరికావు. జగన్ తీరు మారకపోతే వైసీపీకి ఇంకో పదేళ్లైనా పది అంకె దాటదు’ అన్నారు. వంశీ, జోగి రమేష్, నాని, ధనుంజయరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కొమ్మినేని శ్రీనివాసరావు అమాయకులని జగన్ అంటున్నారని, పోలీస్ స్టేషన్ ముందే అలజడి సృష్టించిన వీరంతా అమాయకులా? అని పయ్యావుల నిలదీశారు. తెలంగాణలో ఫ్యాన్ ట్యాపింగ్ అంశంలో ప్రభుత్వం సిట్ వేసింది. పూర్తి నివేదిక బయటకు వచ్చాక ఏం చేయాలనేది ఆలోచిస్తాం’ అన్నారు.