Share News

High Court: సింగయ్య మృతి కేసులో తదుపరి చర్యలు నిలుపుదల

ABN , Publish Date - Jul 02 , 2025 | 04:04 AM

మాజీ సీఎం జగన్‌ గుంటూరు జిల్లా రెంటపాళ్లలో పర్యటించిన సమయంలో ఆయన కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

High Court: సింగయ్య మృతి కేసులో తదుపరి చర్యలు నిలుపుదల

  • హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

  • కౌంటర్‌ దాఖలుకు 2 వారాల గడువు

  • నిలుపుదలపై ఏజీ తీవ్ర అభ్యంతరం

అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌ గుంటూరు జిల్లా రెంటపాళ్లలో పర్యటించిన సమయంలో ఆయన కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జగన్‌ సహా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జగన్‌ పీఎస్‌ కె. నాగేశ్వరరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనీలపై చర్యలను నిలుపుదల చేసింది. కౌంటర్‌ దాఖలుకు ప్రాసిక్యూషన్‌కు 2 వారాల సమయం ఇస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె. శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రాథమికంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో పిటిషనర్లను నిందితులుగా చేర్చలేదని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా లభ్యమైన ఆధారాలు, వీడియో ఫుటేజ్‌ ఆధారంగా పిటిషనర్లను పోలీసులు నిందితులుగా చేర్చారని పేర్కొన్నారు. వాహన ప్రమాదానికి డ్రైవర్‌ను బాధ్యుడిని చేయాలి తప్ప వాహనంలో ప్రయాణిస్తున్న వారిని బాధ్యులను చేయడానికి వీల్లేదని కోర్టు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో అన్ని ఆధారాలు, వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామన్నారు. ఆ తర్వాత క్వాష్‌ పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అరెస్ట్‌ నుంచి పిటిషనర్లకు రక్షణ కల్పించిన నేపథ్యంలో వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదన్నారు. కౌంటర్‌ దాఖలుకు వీలుగా విచారణను రెండువారాలకు వాయిదా వేయాల ని కోరారు.


జగన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. గుర్తు తెలియని వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందినట్లు మొదట ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, జిల్లా ఎస్పీ సైతం ఇదే విషయాన్ని చెప్పారని తెలిపారు. వాహనం ఢీకొన్న అనంతరం సింగయ్య 40 నిమిషాలు ప్రాణాలతోనే ఉన్నారన్నారు. అంబులెన్స్‌ వచ్చిన తర్వా త ఆసుపత్రికి తరలించారని, కారును సీజ్‌ చేసి జగన్‌ను అవమానించారని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా వీడియో డౌన్‌లోడ్‌ చేసినట్లు చెబుతున్నారని, కృత్రిమ మేధ వినియోగించి వీడియోలను సృష్టించడం ఈ రోజుల్లో చాలా సులభంగా మారిందని తెలిపారు. ప్రతిపక్షపార్టీ నాయకుడి పర్యటనలో రోప్‌ పార్టీని ఏర్పాటు చేయలేదన్నారు. జగన్‌ సెక్యూరిటీ విషయంలో ఇప్పటికే రెండు రిట్‌ పిటిషన్లు దాఖలు చేశామని వివరించారు.

జగన్‌.. పోలీసుల మాట వినలేదు: ఏజీ

పోలీసుల ఆదేశాలను జగన్‌ ఎన్నడూ పాటించలేదని ఏజీ అన్నారు. పిటిషనర్లు కోర్టుకు సమర్పించిన వీడియోను పరిశీలించాల్సి ఉందన్నారు. ఎవరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎస్పీ అలాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందో దర్యాప్తు అధికారి తేల్చాల్సి ఉందన్నారు. డ్రోన్‌తో వీడియో రికార్డు చేసిన వ్యక్తికి సమన్లు జారీ చేసి వీడియోను తెప్పించుకునేందుకు సమయం పడుతుందన్నారు. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యా యమూర్తి.. కౌంటర్‌ దాఖలు చేసేందుకు ప్రాసిక్యూషన్‌కు 2 వారాల సమయం ఇచ్చారు. కాగా, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంపై ఏజీ అభ్యరంతరం తెలిపారు. ిఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని గట్టిగా వాదించారు.

Updated Date - Jul 02 , 2025 | 04:06 AM