Share News

Palnadu SP: జగన్‌ సహా వందమందికే అనుమతి

ABN , Publish Date - Jun 17 , 2025 | 05:32 AM

పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్‌ మండలం రెంటపాల గ్రామంలో ఈ నెల 18న నిర్వహించే వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి...

Palnadu SP: జగన్‌ సహా వందమందికే అనుమతి

  • ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు: పల్నాడు ఎస్పీ

  • రేపు రెంటపాలలో విగ్రహావిష్కరణకు వైసీపీ నేత

నరసరావుపేట లీగల్‌, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్‌ మండలం రెంటపాల గ్రామంలో ఈ నెల 18న నిర్వహించే వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సహా వందమందికి మాత్రమే అనుమతి ఇస్తామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. జగన్‌ పర్యటనకు అనుమతి కోరుతూ సత్తెనపల్లి వైసీపీ ఇన్‌చార్జి సుధీర్‌ భార్గవ్‌ రెడ్డి దాఖలు చేసిన అభ్యర్థన పత్రాన్ని పరిశీలించిన ఎస్పీ సోమవారం తన కార్యాలయంలో ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. విగ్రహావిష్కరణకు 30 వేల మంది వచ్చే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేసిందని ఎస్పీ చెప్పారు. అయితే, విగ్రహావిష్కరణ జరిగే ప్రాంతానికి పది అడుగుల రోడ్డు మాత్రమే ఉందని, రోడ్డుకు ఇరువైపులా గృహాలున్నాయని, ఆ ప్రదేశానికి వందమంది కంటే ఎక్కువమంది వెళ్లటానికి అవకాశం లేదని తెలిపారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి సందర్భాల్లో జరిగిన దుర్ఘటనలను దృష్టిలో పెట్టుకుని జగన్‌ సహా వందమంది ప్రజలకు, జగన్‌ కాన్వాయ్‌తోపాటు మరో మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వగలుగుతామని చెప్పారు. శాస్ర్తీయంగా సూచించిన మేరకే అనుమతినిస్తామని, ఉల్లంఘిేస్త చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

Updated Date - Jun 17 , 2025 | 05:32 AM