Share News

Dhammalapati Srinivas: జగన్‌కు భద్రత పెంపుపై ఇప్పటికే రెండు వ్యాజ్యాలు

ABN , Publish Date - Jul 04 , 2025 | 04:34 AM

మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తనకు భద్రత పెంచాలని కోరుతూ హైకోర్టులో రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారు. అక్కడ పొందలేని ఉత్తర్వులను ఆ పార్టీ నేతలు వేసిన పిటిషన్‌లో పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు...

Dhammalapati Srinivas: జగన్‌కు భద్రత పెంపుపై ఇప్పటికే రెండు వ్యాజ్యాలు

  • ఇప్పుడు మరో పిటిషన్‌ వేసిన వైసీపీ నేతలు

  • వారిద్వారా ఉత్తర్వులు పొందేందుకు యత్నం: ఏజీ

  • ఈనెల 9కి విచారణ వాయిదా

అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): ‘మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తనకు భద్రత పెంచాలని కోరుతూ హైకోర్టులో రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారు. అక్కడ పొందలేని ఉత్తర్వులను ఆ పార్టీ నేతలు వేసిన పిటిషన్‌లో పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు’ అని అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ గురువారం హైకోర్టుకు నివేదించారు. నెల్లూరు పర్యటన సందర్భంగా పట్టణంలోని సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో తాత్కాలిక హెలీప్యాడ్‌ ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతించేలా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాలంటూ ఆ పార్టీ నేతలు పిటిషన్‌ వేశారని గుర్తు చేశారు. జగన్‌ తన పర్యటనను వాయిదా వేసుకున్నందున ప్రస్తుత పిటిషన్‌ నిరర్థకం అయ్యిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జగన్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పిస్తుందని వివరించారు. జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తులకు రక్షణ కల్పించే విషయంలో కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలపై పిటిషనర్లు అనుబంధ పిటిషన్‌ వేశారు. దానిపై సవివరంగా కౌంటర్‌ దాఖలు చేస్తాం. విచారణను వాయిదా వేయాలి’ అని కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ వ్యాజ్యంపై తదుపరి విచారణను 9కి వాయిదా వేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా పట్టణంలోని సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో తాత్కాలిక హెలీప్యాడ్‌ ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతించేలా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


పర్యటన సందర్భంగా రోప్‌ పార్టీని ఏర్పాటు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తులకు రక్షణ కల్పించే విషయంలో కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను తమ ముందు ఉంచాలని పిటిషనర్లను ఆదేశించారు. గురువారం వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ... హెలిప్యాడ్‌ విషయంలో అధికారులు ఆలస్యంగా అనుమతులు ఇవ్వడంతో పర్యటన రద్దు అయ్యిందన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తికి రోప్‌ పార్టీ ఏర్పాటు చేయాలన్నారు. రోప్‌ పార్టీ ఏర్పాటు చేయకుంటే జగన్‌ భద్రత ప్రమాదంలో పడుతుందన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 04:37 AM