Share News

AP Revenue Comparison: సంపదపై శోకాలు

ABN , Publish Date - May 16 , 2025 | 02:47 AM

జగన్ హయాంలో రాష్ట్ర ఆదాయం పెరిగినట్టు చెప్పిన వార్తలు అసత్యం. కేంద్ర గ్రాంట్లు మినహాయిస్తే చంద్రబాబు హయాంలో ఆదాయం 4.74 శాతం పెరిగింది.

AP Revenue Comparison: సంపదపై శోకాలు

  • జగన్‌ పత్రిక రోత రాతలు..

  • ఆదాయం తగ్గిందంటూ అబద్ధాలు

  • 2023-24లో రూ.10 వేలకోట్ల రెవెన్యూ గ్రాంటు

  • ఆర్థిక సంఘం నిధులూ వచ్చింది అప్పుడే

  • అవి మినహాయిస్తే రాబడి రూ.1,60,813 కోట్లు

  • 2024-25లో 1,68,443 కోట్లకు పెరిగిన రాబడి

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘సంపద సృష్టిస్తాం’ అని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హయాంలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోతోందట! అప్పులే తప్ప ఆదాయం లేదట! వైసీపీ హయాంలో మాత్రం అంతా భేషుగ్గా వెలిగిపోయిందట! ఇవి.. జగన్‌ రోత పత్రిక రాసిన రాతలు! ఆదాయం తగ్గడం నిజమే! కానీ... అది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కాదు! జగన్‌ సొంత ఆదాయం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు సొంత మీడియాకు అడ్డగోలుగా ప్రకటనల రూపంలో కొన్ని వందల కోట్లు సమర్పించుకున్నారు. ఇక మద్యం, ఇసుకలో వేల కోట్లు ముడుపుల ఆరోపణలు సరేసరి! వెరసి... జగన్‌ సొంత ఆదాయం పడిపోయింది. ఆయన రోత పత్రిక చెప్పినట్లుగా... రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఏమాత్రం తగ్గలేదు. పైగా పెరిగింది.


అర్ధసత్యాలు... వక్రీకరణలు..

జగన్‌ హయాంలో 2023-24తో పోలిస్తే.. చంద్రబాబు పాలనలో 2024-25లో రెవెన్యూ రాబడి, కేంద్ర గ్రాంట్లు తగ్గాయంటూ రోతపత్రిక గురువారం అబద్ధాలు వల్లె వేసింది. 2024-25 గణాంకాలను కాగ్‌ వెల్లడించిందంటూ అర్ధ సత్యాలు, అసత్యాలతో మభ్యపెట్టే యత్నం చేసింది. ‘జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023-24లో రెవెన్యూరాబడి రూ. 1,73,963 కోట్లు. చంద్రబాబు సీఎం అయ్యాక 2024-25లో రెవెన్యూ రాబడి రూ.1,68,443 కోట్లు. ఏడాదిలో రెవెన్యూ రాబడి రూ.5,520 కోట్లు పడిపోయింది’ అని రాసింది. వాస్తవం ఏంటంటే... రాష్ట్ర విభజన తర్వాత 2014-15 నుంచి కేంద్రం నుంచి రావాల్సిన రెవెన్యూ లోటు గ్రాంటు 2023-24లో రూ.10,460 కోట్లు వచ్చింది. దీనికి తోడు 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 2023-24లో రూ.2,691 కోట్ల నిధులు వచ్చాయి. ఆ ఆర్థిక సంఘం నుంచి కొన్నేళ్లపాటు రావాల్సిన నిధులన్నింటినీ... ఎన్నికల ముందు జగన్‌ సర్కారు ఒకేసారి తీసేసుకుంది. దీంతో 2023-24లో రెవెన్యూ రాబడి బాగా పెరిగినట్లు కనిపిస్తుంది. జగన్‌ పత్రిక ఈ విషయం దాచిపెట్టి ఆయన హయాంలో రెవెన్యూ రాబడి ఎక్కువగా ఉన్నట్టు చూపించింది. కేంద్రం ఇచ్చిన రెవెన్యూ లోటు గ్రాంటు రూ.10,460 కోట్లు, ఆర్థిక సంఘం సిఫారసు మేరకు వచ్చిన నిధులు రూ.2,691 కోట్లు.. మొత్తం దాదాపు 13,151 కోట్లు మినహాయిస్తే జగన్‌ ప్రభుత్వంలో 2023-24లో వచ్చిన రెవెన్యూ రాబడి రూ.1,60,813 కోట్లు మాత్రమే. చంద్రబాబు సీఎం అయ్యాక 2024-25లో రెవెన్యూ రాబడి రూ.1,68,443 కోట్లు. అంటే.. జగన్‌ ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు హయాంలో ఏడాదిలో 4.74 శాతం ఎక్కువ.


ఇదీ రాబడి

ట్యాక్స్‌ రెవెన్యూ

  • జగన్‌ ప్రభుత్వం హయాంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ట్యాక్స్‌ రెవెన్యూ రూ.1,31,632 కోట్లు.

  • చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 2024-25లో వచ్చిన ట్యాక్స్‌ రెవెన్యూ రూ.1,41,515 కోట్లు. జగన్‌ ప్రభుత్వంతో పోలిస్తే ఏడాదిలో 7.5 శాతం ఎక్కువ. మరి... ఆదాయం పెరిగినట్లా? తగ్గినట్లా?

జీఎస్టీ వసూళ్లు

  • 2023-24లో జీఎస్టీ వసూళ్లు రూ.45,002.73 కోట్లు

  • 2024-25లో జీఎస్టీ వసూళ్లు రూ.47,853.14 కోట్లు. జగన్‌ ప్రభుత్వంలో కంటే చంద్రబాబు హయాంలో ఏడాదిలో దాదాపు 2,850 కోట్లు ఎక్కువ.

ఎక్సైజ్‌ సుంకం

  • 2023-24లో వసూలైన ఎక్సైజ్‌ సుంకం రూ.15,997.60 కోట్లు.

  • 2024-25లో వసూలైన ఎక్సైజ్‌ సుంకం 19,882,06 కోట్లు. జగన్‌ ప్రభుత్వంలో కంటే చంద్రబాబు హయాంలో ఏడాదిలో దాదాపు 3,900 కోట్ల రాబడి పెరిగింది.

కేంద్ర పన్నుల్లో వాటా

  • 2023-24లో కేంద్ర పన్నుల్లో వాటా రూ.31,838.14 కోట్లు.

  • 2024-25లో కేంద్ర పన్నుల్లో వాటా రూ.36,869.53 కోట్లు. దీని ప్రకారం జగన్‌ ప్రభుత్వంలో కంటే చంద్రబాబు హయాంలో ఏడాదిలో దాదాపు 5 వేల కోట్లు ఎక్కువ.

  • చంద్రబాబు సీఎం అయ్యాక పన్నులు పెంచకున్నా రాబడి పెరగడం విశేషం.

Updated Date - May 16 , 2025 | 07:57 AM