Former CM Jagan: కిక్కుపై కట్టుకథలు
ABN , Publish Date - May 23 , 2025 | 04:16 AM
మాజీ సీఎం జగన్ తన హయాంలో మద్యం స్కామ్ జరగలేదని చెప్పినా, అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పక తప్పించుకున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నకిలీ బ్రాండ్లను ప్రోత్సహించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
స్కామే జరగలేదని బుకాయింపు
అసలు ప్రశ్నలకు జవాబివ్వని జగన్
జే-బ్రాండ్లతో జనాన్ని బాదింది ఆయనే
ఇప్పుడున్న బ్రాండ్లపై నానా యాగీ
అవన్నీ ప్రముఖ కంపెనీల ఉత్పత్తులే
రాజ్ కసిరెడ్డికి సంబంధమే లేదట?
జగన్ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు స్వీకరించలేదు? కొన్ని డిస్టిలరీలకు మాత్రమే ఎక్కువ ఆర్డర్లు ఎందుకు వెళ్లాయి? పాపులర్ బ్రాండ్లు ఎందుకు మాయమయ్యాయి? మాయదారి మందు ఎందుకు ప్రత్యక్షమైంది? తెలంగాణతో పోల్చితే ఏపీలో కొనుగోలు ధర ఎక్కువ ఉండటానికి కారణమేమిటి? ‘ఆటోమేటిక్’గా మద్యం ఆర్డర్లను పెట్టే సాఫ్ట్‌వేర్ తీసేసి.. మాన్యువల్ విధానం ఎందుకు తెచ్చారు? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు! కానీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ వీటన్నింటినీ పక్కన పెట్టేశారు. తన హయాంలో మద్యం స్కామే జరగలేదని చెప్పుకొచ్చారు.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
గురువారం రెండు గంటలకుపైగా సాగిన ప్రెస్‌మీట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ అనేక ఆరోపణలు గుప్పించారు. సిరి క్లాసిక్ బ్లూ ఫైనెస్ట్ విస్కీ, గ్రేసన్స్ సిల్వర్ స్ర్టిప్స్, రాయల్ ప్యాలెస్ బ్రాందీ, ఓల్డ్ టైమర్ బ్లూ క్లాసిక్ విస్కీ, గ్రేసన్స్ కింగ్స్‌వెల్ బ్రాందీ... ఇలా ఊరూపేరులేని జే బ్రాండ్లను మద్యంప్రియులకు అంటగట్టిన జగన్... నేడు మార్కెట్‌లో ఉన్న మద్యం బ్రాండ్ల ఫొటోలు చూపిస్తూ వాటిపై నానాయాగీ చేశారు. 2019 నుంచి మార్కెట్‌లో ఉన్న గుడ్‌ఫ్రెండ్స్ మొదలు సుమో, కేరళ మాల్ట్, రాయల్ లాన్సర్ విస్కీ.. ఇలా అనేక బ్రాండ్ల ఫొటోలు చూపిస్తూ అవన్నీ ఊరూపేరు లేనివన్నట్లుగా పచ్చి అబద్ధాలు వల్లించారు. నిజానికి.. అవన్నీ ప్రముఖ కంపెనీల ఉత్పత్తులే. ప్రీమియం బ్రాండ్లతోపాటు... ధర తక్కువ ఉండే లిక్కర్‌నూ అందుబాటులోకి తెచ్చాయి. మార్కెట్ వ్యూహంతోపాటు రూ.99కే మంచి మద్యం ఇవ్వాలన్న ప్రభుత్వ విధానం మేరకు వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇదీ వాస్తవం. అయినా సరే... జగన్ ఈ బ్రాండ్లపై ఆరోపణలు చేశారు. దీంతోపాటు తన హయాంలో మద్యం స్కామ్ జరగలేదని చెప్పుకొనేందుకు రకరకాల విన్యాసాలు చేశారు. ఇవీ ఆ వివరాలు...
జగన్: ఎవరైనా అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారు. అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా?
వాస్తవం: వైసీపీ హయాంలో రెండో సంవత్సరం మాత్రమే అమ్మకాలు తగ్గాయి. మిగిలిన నాలుగేళ్లు అమ్మకాలు భారీగా పెరిగాయి. అయితే అమ్మకాలు తగ్గినా, పెరిగినా అసలు అమ్మిన మద్యం ఎవరిదనేది మాత్రం జగన్ చెప్పలేదు. ఉదాహరణకు 2020-21లో అతి తక్కువగా 1.87కోట్ల కేసుల లిక్కర్, 0.57కోట్ల కేసుల బీరు అమ్మారు. ఆ మద్యం విలువ రూ.17,948కోట్లు. అంటే అందులో సుమారు రూ.4వేల కోట్లు ఉత్పత్తి వ్యయం ఉంటుంది. ఆ రూ.4వేల కోట్లు ఏ కంపెనీలకు వెళ్లాయి? ఎంతసేపూ అమ్మకాలు తగ్గించాం అని చెప్పిన జగన్, తన హయాంలో కొత్తగా తెరపైకి తీసుకొచ్చిన బ్రాండ్ల గురించి చెప్పనే లేదు. ఉదాహరణకు టీడీపీ హయాంలో లక్షల కేసులు అమ్మకాలున్న ఆఫీసర్స్ చాయిస్, మెక్‌డోవెల్స్, హెచ్.డి.హెవెన్స్ డోర్ విస్కీ, ఇంపీయల్ బ్లూ, 999 పవర్‌స్టార్ ఫైన్ విస్కీ బ్రాండ్లు వైసీపీ హయాంలో అడ్రస్ లేకుండా పోయాయి. కానీ సిరి క్లాసిక్ బ్లూ ఫైనెస్ట్ విస్కీ, గ్రేసన్స్ సిల్వర్ స్ర్టిప్స్, రాయల్ ప్యాలెస్ బ్రాందీ, ఓల్డ్ టైమర్ బ్లూ క్లాసిక్ విస్కీ, గ్రేసన్స్ కింగ్స్‌వెల్ బ్రాందీ అనూహ్యంగా తెరపైకి వచ్చాయి. ఈ ఐదు కంపెనీలు కలిపి ఒక్క 2023-24లో 78లక్షల కేసులు అమ్మాయి. 2018-19లో ఈ ఐదు కంపెనీలు కలిపి రాష్ట్రంలో అమ్మింది సున్నా. మరి ఈ కంపెనీల గురించి జగన్ ఎందుకు చెప్పలేదు?
జగన్: అమ్మకాలు తగ్గించాం. ఆదాయం పెంచాం.
వాస్తవం: సంపూర్ణ మద్యపాన నిషేధం హామీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మద్యనిషేధం చేయకపోగా షాక్ కొట్టేలా ధరలు పెంచుతామని చెప్పి 100శాతం ధరలు పెంచారు. దీనివల్ల 2020-21లో 1.87కోట్ల కేసుల లిక్కర్, 57లక్షల కేసుల బీరు అమ్మారు. దాంతో ఆదాయం పడిపోయింది. వెంటనే అధికారులను పిలిపించుకుని మాట్లాడిన జగన్ ఆ తర్వాత ధరలు తగ్గించారు. ఫలితంగా ఆ తర్వాత ఏడాది 1.87కోట్ల కేసుల లిక్కర్, 82లక్షల కేసుల బీరు, 2023-24లో ఏకంగా 3.32కోట్ల కేసుల లిక్కర్, 1.12కోట్ల కేసుల బీరు అమ్మారు. మరి నాలుగేళ్లలో అమ్మకాలు ఇంత లా ఎలా పెరిగాయి? తగ్గించిన ధరలు ఎందుకు కొనసాగించలేదు? ఈ విషయాన్ని జగన్ ఎక్కడా ప్రస్తావించలేదు.
జగన్: ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా అమ్మితే లంచాలు ఇస్తారా?
వాస్తవం: తమ ప్రభుత్వ హయాంలో లాభాపేక్ష లేకుండా మద్యం అమ్మకాలను చేపట్టామని జగన్ చెబుతున్నారు. ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు ఇస్తేనే లంచాలు ఇస్తారని, ప్రభుత్వం అమ్మితే లంచాలు ఎక్కడుంటాయని ప్రశ్నించారు. కానీ వ్యాపారంలో అసలు కిటుకును బయటపెట్టలేదు. ప్రైవేటు వ్యక్తుల చేతిలో మద్యం షాపులు ఉంటే వారు వ్యాపార కోణంలోనే ఆలోచిస్తారు. ఏ బ్రాండ్లు అమ్ముడుపోతే వాటినే ప్రభుత్వం నుంచి కొంటారు. అందువల్లే వైసీపీ.. ప్రభుత్వ మద్యం షాపులు తీసుకొచ్చింది. అందులో పనిచేసే సిబ్బంది ప్రభుత్వం చెప్పినట్లే చేశారు. వినియోగదారులు అడిగింది కాకుండా పైనుంచి ఆదేశించినవే అమ్మారు. పైస్థాయిలో ఏ బ్రాండ్లు అమ్మమంటే వాటినే ఇండెంట్ పెట్టి షాపుల్లో విక్రయించేలా చేశారు. అసలు ఏ బ్రాండ్ అమ్మాలనేది తాడేపల్లి ప్యాలెస్ నిర్ణయించిన తర్వాత ఇక అది ప్రభుత్వ షాపు, ప్రైవేటు షాపు ఏదైతే ఏముంటుంది?
జగన్: చంద్రబాబు చేతుల్లోనే ప్రైవేటు మద్యం మాఫియా ఉంది. ఆ షాపుల సైన్యంతో ఇండెంట్ పెడతారు. ఏ డిస్టిలరీకి మేలు చేయాలనుకుంటే వారికే ఆర్డర్లు ఇస్తారు.
వాస్తవం: ప్రైవేటు వ్యక్తులను చంద్రబాబు మేనేజ్ చేసి ఇండెంట్లు పెట్టిస్తున్నారని, గతంలో పెట్టించారని జగన్ ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తులను బాబు మేనేజ్ చేయగలిగితే... ప్రభుత్వ అధీనంలోనే ఉన్న ప్రభుత్వ షాపులను సీఎంగా జగన్ మేనేజ్ చేయలేరా? ఈ లాజిక్ మిస్ అయిన జగన్... అమ్మకాలు ప్రభుత్వం చేతిలో ఉంటే ఏంచేయలేమని, ప్రైవేటులో అయితే ఏదైనా చేయొచ్చని, తన కింద పనిచేసిన వారు తన మాట వినలేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. పైగా వైసీపీ హయాంలో ఆన్‌లైన్ ఆర్డర్ల విధానం తొలగించారు. ఆన్‌లైన్ విధానంలో అయితే డిమాండ్‌కు తగ్గట్టుగా ఆటోమేటిక్‌గా ఆర్డర్లు ప్లేస్ అవుతాయి. ఉదాహరణకు ఒక నెలలో ఏ బ్రాండ్ అమ్మకాలు ఎంత ఉన్నాయనే రికార్డుల ఆధారంగా ఆటోమేటిక్‌గా ఆర్డర్లు వెళ్తాయి. టీడీపీ ప్రభుత్వం నుంచి కొనసాగింపుగా చూస్తే పాపులర్ బ్రాండ్లకు తప్ప జే బ్రాండ్లకు అవకాశం రాదు. అందుకే ఆన్‌లైన్ తొలగించి, మాన్యువల్ ప్రవేశపెట్టారు.
జగన్: మా హయాంలో డిస్టిలరీలకు లాభాలు తగ్గించాం.
వాస్తవం: మద్యం కంపెనీలకు (జగన్ చెబుతున్న డిస్టిలరీలు) లాభాలు తగ్గించారనేది పచ్చి అబద్ధం. ఎందుకంటే వారికిచ్చే మొత్తం పెంచారు కాబట్టే ఆ అదనంగా పెంచింది ముడుపుల రూపంలో వెళ్లింది. అయితే ప్రస్తుత బ్రాండ్‌కు అప్పటికప్పుడు ధరలు పెంచలేరు కాబట్టి సిమిలర్ సౌండింగ్ బ్రాండ్స్ పేరుతో కొత్తవాటిని సృష్టించారు. ఉదాహరణకు ఒక బ్రాండ్ ధరను ఎలా పెంచారంటే మాన్సన్ హౌస్ ఫ్రెంచ్ బ్రాందీని... మాన్సన్ హౌస్ సుపీరియర్ బ్రాందీగా కొత్త పేరుతో తీసుకొచ్చారు. వాస్తవానికి రెండు బ్రాండ్లు ఒకే కంపెనీవి. కొత్తగా వచ్చిన సుపీరియర్ బ్రాందీకి ఇచ్చే రేటును ప్రభుత్వం పెంచేసింది. తెలంగాణతో పోలిస్తే రూ.600 అదనంగా చెల్లించింది. అయితే వినియోగదారులకు మాత్రం మాన్సన్‌హౌస్ అనేది మాత్రమే పెద్దగా కనిపిస్తుంది. సుపీరియర్ అనేది కనిపించీ కనిపించకుండా చిన్నగా ఉంటుంది. కేసు రూ.1,300గా ఉన్న బ్రాండ్ ధరను రూ.1,697గా, రూ.696 ఉంటే దానిని రూ.1,009గా ఇలా పేరు మార్చి అదే బ్రాండ్‌కు ధర పెంచారు. అలా పెంచిన మొత్తం తిరిగి తాడేపల్లి ప్యాలె స్‌కు ముడుపుల రూపంలో చేరింది.
జగన్: పన్నులు బాది డిస్టిలరీలకు లాభాలు లేకుండా చేశాం.
వాస్తవం: జగన్ చెప్పినట్లు వైసీపీ హయాంలో పన్నులు భారీగా పెంచారు. అయితే దానితో డిస్టిలరీలకు ఎలాంటి సంబంధం లేదు. డిస్టిలరీల్లో తయారుచేసిన మద్యంపై ప్రభుత్వం పన్నులు విధిస్తుంది. ఆ పన్నులను చెల్లించాల్సింది వినియోగదారులు. ఇందులో మద్యం కంపెనీలకు ఒక్క రూపాయి నష్టం ఉండదు. వైసీపీ హయాంలో స్పెషల్ మార్జిన్, రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్, అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అనే పన్నులను ప్రవేశపెట్టారు. ఫలితంగా సుమారు రూ.120గా ఉన్న మద్యం సీసా రూ.200కు చేరింది. అదనంగా పెంచిన దాంట్లో కొంతమొత్తం తాడేపల్లి ప్యాలె్‌సకు చేరిందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. అయినా ఈ బాదుడును జగన్ గొప్పగా చెప్పుకొన్నారు.
జగన్: రాజ్ కసిరెడ్డి ఒక సలహాదారు. ఆయనకు మద్యంతో సంబంధం ఏంటి?
వాస్తవం: లిక్కర్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డి. ఏ కంపెనీకి ఆర్డర్లు ఇవ్వాలి? షాపుల్లో ఏ రోజు ఏ బ్రాండ్లు అమ్మాలి? అనేది నిర్ణయించింది ఆయనే. కంపెనీలకు బిల్లులు చెల్లించిన వెంటనే హైదరాబాద్ కేంద్రం గా ముడుపులు తీసుకుంది కసిరెడ్డి మనుషులే. మద్యం కుంభకోణంలో ఆయనది అత్యంత కీలక పాత్ర. ఇప్పటికే సిట్ విచారణలో అనేక అంశాలు వెలుగులోకొచ్చాయి. అయినా రాజ్ కసిరెడ్డి ఒక మంచి వ్యక్తి అని, అసలు ఆయనకు మద్యం అంటేనే తెలియదన్నట్టుగా జగన్ చెప్పుకొచ్చారు. ఇక ఎస్పీవై, ఇతర డిస్టిలరీల ద్వారా పిచ్చి బ్రాండ్లు ఉత్పత్తి చేయించి లాభం పొందినట్లు ఆరోపణలున్న ఎంపీ మిథున్‌రెడ్డికి కూడా ఏ పాపం తెలియదని ఆయన చెప్పారు. మద్యం కుంభకోణం వాస్తవమేనని అంగీకరించిన విజయసాయిరెడ్డి... చంద్రబాబుకు లొంగిపోయారంటూ ఆయనపై టీడీపీ ముద్ర వేశారు. ఇంకా ఆయన నియమించిన అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై కూడా వైసీపీ విడుదల చేసిన మద్యం వాస్తవాల ప్రజెంటేషన్‌లో ప్రతికూలంగా రాసుకొచ్చారు. కానీ వాసుదేవరెడ్డి అప్పటి సీఎం కార్యదర్శి, లిక్కర్ స్కామ్‌లో నిందితుడు ధనుంజయరెడ్డికి అత్యంత సన్నిహితుడు.