Minister Atchannaidu: రైతులపై జగన్ మొసలి కన్నీరు
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:45 AM
రైతులకు ఏ సమస్య వచ్చినా వారు అడక్కముందే స్పందించి, మేలు చేస్తుంటే.. రాష్ట్రానికి ఐదేళ్లు సీఎంగా వెలగబెట్టిన జగన్.. వారిలో అయోమయం సృష్టిస్తున్నారని...
వారిలో అయోమయం సృష్టిస్తున్నారు: అచ్చెన్న
అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రైతులకు ఏ సమస్య వచ్చినా వారు అడక్కముందే స్పందించి, మేలు చేస్తుంటే.. రాష్ట్రానికి ఐదేళ్లు సీఎంగా వెలగబెట్టిన జగన్.. వారిలో అయోమయం సృష్టిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతులకు యూరియా అందట్లేదని, ఉల్లి కొనట్లేదని తప్పుడు పోస్టులతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రైతులపై కొందరు మొసలి కన్నీరు కారుస్తున్నారు, ప్రతీదీ రాజకీయం చేసి, రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మిర్చి, కోకో, నల్ల బర్లీ, చిత్తూరు జిల్లాలో తోతాపురి రైతులను ప్రభుత్వం ఆదుకున్నదని చెప్పారు. ఉల్లి ధర పడిపోతే క్వింటా రూ.1,200 చొప్పున కొనాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. యార్డుకు వచ్చే ప్రతి ఉల్లి గడ్డా కొనుగోలు చేస్తున్నాం. దీనికి హర్షించకుండా, ఉల్లి కొనట్లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే.. దేనిమీదైనా చర్చిస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యల్ని విమర్శిస్తున్న సజ్జలకు ఏ అర్హత ఉంది? నువ్వేమైనా ఎమ్మెల్యేవా, వార్డు మెంబర్‌వా? అని నిలదీశారు. జగన్‌కు ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇవ్వకపోతే.. ఎవరేం చేస్తారని మంత్రి ప్రశ్నించారు.