Share News

Jagan Criticizes: ఆ ఐదేళ్లూ రైతులకు నరకం

ABN , Publish Date - Nov 06 , 2025 | 05:37 AM

మొంథా తుఫాన్‌ బాధితుల పరామర్శకు కృష్ణా జిల్లా వెళ్లిన వైసీపీ అధినేత జగన్‌ రైతులపై ఎనలేని ప్రేమ ఒలకబోశారు. ‘నష్టపరిహారం ఇస్తే ధాన్యం కొనరంట......

 Jagan Criticizes: ఆ ఐదేళ్లూ రైతులకు నరకం

  • జగన్‌ ప్రభుత్వంలో పరిహారం ఇస్తే ధాన్యం కొనుగోళ్లు బంద్‌

  • గతం మరచి కూటమిపై జగన్‌ నిందలు

మొంథా తుఫాన్‌ బాధితుల పరామర్శకు కృష్ణా జిల్లా వెళ్లిన వైసీపీ అధినేత జగన్‌ రైతులపై ఎనలేని ప్రేమ ఒలకబోశారు. ‘నష్టపరిహారం ఇస్తే ధాన్యం కొనరంట.. రైతుల్ని ప్రభుత్వం బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది’ అంటూ కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. ఎన్యూమరేషన్‌ కొనసాగుతున్న సమయంలో రైతుల్ని ఆందోళనకు గురిచేసేలా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కొత్తగా ఈ ఆంక్షలు పెట్టినట్లుగా జగన్‌ ఆరోపించారు. వాస్తవానికి ఈ నిబంధనను గత ప్రభుత్వమే అమలు చేసింది. భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తే.. ఆ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా ఆంక్షలు పెట్టింది. తడిసిన వరి ధాన్యాన్ని కొనాల్సి వస్తుందని ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలతోనే అప్పటి అధికారులు ఈ ఆంక్షలను అమలు చేశారు. జగన్‌ ఈ విషయం మరిచి కూటమి ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారు. 2019-24 మధ్య అనేక సార్లు అధిక వర్షాలు కురిసినప్పుడు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. గత ప్రభుత్వం కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోలేదు. ఎఫ్‌సీఐ మార్గదర్శకాల పేరుతో తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని చాలా వరకు కొనుగోలు చేయలేదు.


పైగా ధాన్యం కొనాల్సి వస్తుందని.. సొమ్ము చెల్లింపులో తీవ్ర జాప్యం చేశారన్న విమర్శలు అప్పట్లో రైతుల నుంచి వచ్చాయి. అప్పట్లో చాలా ప్రాంతాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది కూడా కేవలం వైసీపీ మద్దతుదారులైన రైతుల నుంచే ధాన్యం కొనుగోలు చేసి, ఇతర పార్టీల మద్దతుదారుల ధాన్యాన్ని పెద్దగా కొనుగోలు చేయలేదన్న వాదన కూడా ఉంది. దీంతో రైతులు చాలా వరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేకపోయారు. ఇటీవల కృష్ణా జిల్లాలో పర్యటించిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి పంట కొనుగోళ్ల విషయాన్ని కొందరు రైతులు తీసుకెళ్లారు. మంత్రి అధికారులతో మాట్లాడి, ఈ సారి అలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేశాక 21 రోజుల్లో రైతులకు నగదు చెల్లించాలని నిబంధన పెట్టారు. అయితే చాలా సార్లు 21 రోజులు దాటినా డబ్బులు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేశాక 48 గంటల్లోనే రైతులకు నగదు చెల్లిస్తున్నారు.

Updated Date - Nov 06 , 2025 | 05:45 AM