ప్లంబర్లకు పట్టాల పంపిణీలో అక్రమాలు
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:04 AM
పట్టణంలోని పుట్టపర్తి ప్రధాన రహదారి పక్కన ఉన్న సర్వేనెంబరు 650లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ చేయించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు కోరారు.

ధర్మవరం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పుట్టపర్తి ప్రధాన రహదారి పక్కన ఉన్న సర్వేనెంబరు 650లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ చేయించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు కోరారు. ఈ మేరకు ఆర్డీఓ కార్యాలయ ఏఓ కతిజన కుఫ్రా, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్‌కు గురువారం వినతిపత్రాలు అందజేసిన ఆయన మాట్లాడారు. గతంలో ప్లంబర్లకు భూమి కేటాయించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు ప్లంబర్స్ సంఘం నాయకులు, ఆ పార్టీ నాయకులతో కుమ్మక్కై తోటి ప్లంబర్లకే కుచ్చుటోపీ పెట్టారన్నారు. 650 సర్వేనెంబర్‌లో ప్లంబర్స్ అందరికి కావాలసినంత స్థలం ఉన్నప్పటికీ ప్లంబర్స్ యూనియన నాయకులు, వైసీపీ నాయకులు కుమ్మక్కై అందిన కాటికి దోచుకున్నారన్నారు. ప్లంబర్స్‌లో అర్హులకు మొండిచేయి చూపి వారిని వీధిన పడేలా చేశారని ఆరోపించారు. ప్లంబర్స్ యూనియన నాయకులు, కొందరు వైసీపీ నాయకులు ప్రధాన రోడ్డుకు అనుకుని ఉన్న విలువైన స్థలాలను నొక్కేయడంతో పాటు మిగిలిన స్థలాలన్నీ తమ వర్గీయులకే అందేలా చేసుకున్నారన్నారు. అంతేకాకుండా 2024 ఎన్నికల సమయంలో ధర్మవరానికి వచ్చిన తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లు అప్పటి అధికార పార్టీతొత్తులుగా వ్యవహరించి.. ప్లంబర్లకు ఇచ్చిన స్థలాన్ని ముడుపులు తీసుకొని.. ఎవరికి పడితే వారికి పట్టాలు ఇచ్చారన్నారు. కోర్టులో ఉన్న కేసును కూడా పక్కదోవ పట్టించారన్నారు. ఈ అక్రమాలపై ఉన్నత స్థాయి అధికారులతో విచారణ చేపట్టి.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సీపీఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టిరమణ, చేనేత కార్మికసంఘం జిల్లా కార్యదర్శి బుడగ వెంకటనారాయణ, నాయకులు నాగభూషణ, పెద్దన్న, నారాయణ, నారాయణస్వామి ఉన్నారు.