Share News

P.S.R. Anjaneyulu: పీఎస్ఆర్ కు రిమాండ్‌

ABN , Publish Date - Apr 24 , 2025 | 05:23 AM

కాదంబరి జత్వాని కేసులో నిందితుడైన ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులను కోర్టు రిమాండ్‌కు విధించింది. ఆయన ఆత్మస్థైర్యంగా తనపక్కను వివరించి, తనపై నమోదైన కేసుల్లో ప్రమేయం లేదని పేర్కొన్నారు.

P.S.R. Anjaneyulu: పీఎస్ఆర్ కు  రిమాండ్‌

కేసును వాదించుకున్న పీఎ్‌సఆర్‌.. మే 7 వరకు రిమాండ్‌

విచారణకు సహకరించలేదు: ప్రాసిక్యూషన్‌

విజయవాడ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఐపీఎస్‌ అధికారి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు కటకటాలపాలయ్యారు. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ఆయనకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. ఈ కేసులో పీఎ్‌సఆర్‌ను సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయం నుంచి వైద్య పరీక్షల నిమిత్తం బుధవారం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మూడో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్‌, డిఫెన్స్‌ న్యాయవాదుల వాదనలను విన్నాక న్యాయాధికారి పి.తిరుమలరావు మే ఏడో తేదీ వరకు రిమాండ్‌ విధించారు. అనంతరం విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.


వాదనలు చాంబర్‌లో... తీర్పు హాలులో...

పీఎ్‌సఆర్‌ను 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నందున ఉదయం ఎనిమిది గంటలకే పోలీసులు కోర్టుకు తరలించారు. న్యాయాధికారి తిరుమలరావు ఇరువర్గాల న్యాయవాదులను చాంబర్‌కు పిలిపించుకున్నారు. తాము కోర్టు హాలులో వాదనలు వినిపిస్తామని, బెంచ్‌పైకి రావాలని న్యాయాధికారిని పీఎ్‌సఆర్‌ తరపు న్యాయవాదులు కోరారు. కోర్టు సమయం కాకుండా బెంచ్‌పైకి రాలేనని ఆయన బదులిచ్చారు. ఆ సమయం వరకు తాము వేచి ఉంటామని న్యాయవాదులు చెప్పారు. దానిప్రకారం చూస్తే నిందితుడ్ని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన 24 గంటల సమయం దాటిపోతుందని న్యాయాధికారి వారికి స్పష్టం చేశారు. దీంతో న్యాయాధికారి చాంబర్‌లో వాదనలు ప్రారంభమయ్యాయి. ప్రాసిక్యూషన్‌ తరపున జేడీ రాజేంద్రప్రసాద్‌, హైకోర్టు అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సాయిరోహిత్‌ వాదనలు వినిపించారు. ‘‘కాదంబరి జత్వానిపై కేసు నమోదు చేయడం దగ్గర నుంచి ఆమె కుటుంబాన్ని అరెస్టు చేయడం వరకు మొత్తం ప్రక్రియను పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు పర్యవేక్షించారు. ఇదే విషయాన్ని అప్పటి డీసీపీగా ఉన్న విశాల్‌గున్నీ తన వాంగ్మూలంలో తెలిపారు. విశాల్‌ గున్నీకి డీఐజీ పదోన్నతి ఇచ్చి విశాఖ రేంజ్‌కు బదిలీ చేయగా, జత్వాని కేసులో అరెస్టులు పూర్తయ్యే వరకు రిలీవ్‌ చేయబోమని పీఎ్‌సఆర్‌ ఆయనను బెదిరించారు. పీఎ్‌సఆర్‌కు సీఆర్పీసీ 47, 48 ప్రకారం అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని సీఐడీ అధికారులు అందజేశారు.’’ అని తెలిపారు. పీఎ్‌సఆర్‌ తరపున నగేశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘జత్వాని కేసులో ఉన్న ఇతర నిందితులకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ నిందితుడ్నీ విచారణకు పిలవడం లేదని స్వయంగా ఏజీ కోర్టుకు వివరించారు. అటువంటి పరిస్థితుల్లో పీఎ్‌సఆర్‌ అరెస్టు సరికాదు. హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ తీర్పులను అనుసరించి రిమాండ్‌ను తిరస్కరించా’’లని అభ్యర్థించారు.


వాదనలు వినిపించిన పీఎస్ఆర్

కాదంబరి జత్వాని కేసులో నిందితుడిగా న్యాయాధికారి ముందు నిలబడిన పీఎ్‌సఆర్‌ తన వాదనలు తానే వినిపించుకున్నారు. ఆయన తరపున న్యాయవాదులు హాజరై వాదనలు వినిపించినప్పటికీ మధ్యమధ్యలో పీఎ్‌సఆర్‌ స్వయంగా వాదనలు వినిపించుకున్నారు. సుమారుగా 10-15 నిమిషాలపాటు ఆయన చెప్పదలచిన విషయాలను న్యాయాధికారికి వివరించారు. ‘‘నేను విచారణకు సహకరించడం లేదన్న వాదనల్లో వాస్తవం లేదు. జత్వాని ఇచ్చిన ఫిర్యాదుపై ఇబ్రహీంపట్నం పోలీ్‌సస్టేషన్‌లో నాపై క్రైం నంబరు 469/2024తో కేసు నమోదు చేశారు. దీనికి ముందు కుక్కల విద్యాసాగర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై క్రైం నంబరు 90/2024తో ఒక కేసు నమోదు చేశారు. నన్ను 90/2024 కేసులోనే విచారణకు పిలిచారు. ఆ కేసులో నా పేరు నిందితుడిగా గానీ, సాక్షిగా గానీ లేదు. అందువల్లే ఆ కేసులో విచారణకు ఎందుకు హాజరుకావాలో చెబితే వస్తానని విచారణాధికారులకు తెలియజేశాను. జత్వాని కేసును నేను ఏస్థాయిలోనూ పర్యవేక్షించలేదు. కేసు నమోదు చేసి ఇన్ని నెలలు గడుస్తున్నా నేను ఎక్కడికీ పారిపోలేదు. కేసు నమోదు చేసిన తర్వాత నా ప్రమేయంతోనే జత్వానిపై కేసు నమోదు చేసినట్టు వాంగ్మూలం ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నట్టు విశాల్‌గున్నీ ఫోన్‌ చేశారు. అలా చేయడం తప్పని, ఆవిధంగా వాంగ్మూలం ఇవ్వొద్దని విశాల్‌గున్నీకి చెప్పాను. శాఖాపరంగా జరిగిన విచారణను ఆధారం చేసుకుని నన్ను అరెస్టు చేయడం అసంబద్ధం.’’ అని పీఎస్‌ఆర్‌ వాదించారు


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 24 , 2025 | 05:23 AM