YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో మళ్లీ కదలిక
ABN , Publish Date - Feb 06 , 2025 | 04:47 AM
వివేకా హత్య కేసును అప్పట్లో విచారణ చేసిన సీబీఐ ఎస్పీ రాంసింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలంటూ తనను వేధించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుతో ఏకంగా సెంట్రల్ జైలు సూపరిటెండెంట్, డీఎస్పీ, సీఐలతో పాటు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డిలపై కేసు నమోదైంది.
తప్పుడు సాక్ష్యం ఇవ్వాలని బెదిరించారంటూ దస్తగిరి ఫిర్యాదు
నలుగురిపై కేసు.. ఏ1గా దేవిరెడ్డి చైతన్యరెడ్డి
ఏ2గా కడప జైలు మాజీ సూపరింటెండెంట్
నిందితుల్లో డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వర్‌రెడ్డి
(కడప-ఆంధ్రజ్యోతి)
మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కదలిక వచ్చింది. కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. తనను జైలులో బెదిరింపులకు గురిచేశారంటూ ఇటీవల ఫిర్యాదు చేశాడు. వివేకా హత్య కేసును అప్పట్లో విచారణ చేసిన సీబీఐ ఎస్పీ రాంసింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలంటూ తనను వేధించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుతో ఏకంగా సెంట్రల్ జైలు సూపరిటెండెంట్, డీఎస్పీ, సీఐలతో పాటు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డిలపై కేసు నమోదైంది. దీంతో వివేకా హత్య కేసు మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. తాజా కేసులో ఏ-1గా డాక్టర్ చైతన్యరెడ్డి, ఏ-2గా గతంలో కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌గా పనిచేసిన ప్రకాశ్, ఏ-3గా గతంలో జమ్మలమడుగులో డీఎస్పీగా పనిచేసిన నాగరాజు, ఏ-4గా, ఎర్రగుంట్ల సీఐగా పనిచేసిన ఈశ్వర్‌రెడ్డిపై ఐపీసీ 341, 506, 323, 195(ఎ), 330 సెక్షన్ల కింద పులివెందుల అర్బన్ ఎస్‌ఐ విష్ణునారాయణ బుధవారం కేసు నమోదు చేశారు. దస్తగిరి ఫిర్యాదులో ముఖ్యమైన వివరాలు.. ‘వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారినందున తీవ్రంగా వేధించారు. నాపై 2023లో ఎర్రగుంట్లలో ఓ కిడ్నాప్ కేసు నమోదైంది.
దాన్ని అడ్డుపెట్టుకుని వివేకా హత్యకేసులో సాక్ష్యం చెప్పవద్దంటూ అప్పట్లో ఎర్రగుంట్ల సీఐగా పనిచేసిన ఈశ్వరయ్య, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఆ కేసులో రిమాండు నిమిత్తం కడప సెంట్రల్ జైలుకు తరలించాక.. అక్కడ దేవిరెడ్డి శంకర్‌రెడ్డి కొడుకు దేవిరెడ్డి చైతన్యరెడ్డి, సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ బెదిరించారు. చైతన్యరెడ్డి బెదిరిస్తూ.. నీవు అప్రూవర్‌గా మారి మా రాజకీయ జీవితం నాశనం చేశావు. నీ వల్ల మానాన్న, అవినాశ్‌రెడ్డి నాన్న భాస్కర్‌రెడ్డి జైలుకు వెళ్లారు. భాస్కర్‌రెడ్డికి ఏమైనా జరిగితే అవినాశ్‌రెడ్డి అన్న, నేను నిన్ను నరికేస్తాం. మా మాట వింటే బాగుపడతావు. లేదంటే జైల్లోనే చస్తావు. మేం చెప్పినట్లు వింటే రూ. 20 కోట్లు అడ్వాన్స్ ఇస్తాం. వివేకా పీఏ క్రిష్ణారెడ్డి ఎలా సహకరిస్తున్నారో నీవు అలా సహకరిస్తే బావుంటావు, లేదంటే జీవితాంతం జైల్లోనే ఉంచేస్తామని బెదిరించాడు’’ అని ఫిర్యాదులో దస్తగిరి పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై దస్తగిరి పులివెందుల పోలీసులకు ఈనెల 3వ తేదీన ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
Nara Lokesh : జగన్ సెక్యూరిటీపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan: విశాంత్రిలో పవన్ కళ్యాణ్.. అసలు విషయం ఇదే..