Share News

Indian Navy submarine base: ఏపీలో అణు జలాంతర్గామి స్థావరం

ABN , Publish Date - Apr 08 , 2025 | 04:37 AM

తూర్పు తీరంలో సముద్ర రక్షణ కోసం విశాఖ సమీపంలో రాంబిల్లిలో నిర్మిస్తున్న ఐఎన్‌ఎస్‌ వర్ష 2026లో అందుబాటులోకి రానుంది. అణు సబ్‌మెరైన్లకు హబ్‌గా ఉండే ఈ వ్యూహాత్మక స్థావరం భారత సముద్ర బలగాలకు కీలకమైనదిగా నిలవనుంది.

Indian Navy submarine base: ఏపీలో అణు జలాంతర్గామి స్థావరం

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో నేవీ ప్రత్యామ్నాయ బేస్‌

విశాఖ నుంచి 50కి.మీ. దూరంలో రహస్య కేంద్రం

2026లో ప్రారంభించేందుకు కేంద్రం ప్రణాళిక

ఐఎన్‌ఎస్‌ వర్షలో భాగంగా తూర్పుతీరంలో ఏర్పాటు

670 హెక్టార్ల అటవీ భూమి కేటాయింపు

అణు జలాంతర్గాములు, యుద్ధనౌకల కోసం నిర్మాణం

ఇక్కడ 12 సబ్‌మెరైన్లను డాక్‌ చేసుకునే అవకాశం

భూగర్భ సొరంగాలు, బంకర్లతో ఇన్నర్‌, ఔటర్‌ హార్బర్‌

విశాఖటప్నం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): సముద్ర రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా మరో కీలక ముందడుగు పడనుంది. తూర్పు తీరంలో రక్షణ అవసరాల కోసం నిర్మిస్తున్న నేవీ ప్రత్యామ్నాయ స్థావరం ‘ఐఎన్‌ఎస్‌ వర్ష’ను 2026లో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది పూర్తిగా వ్యూహాత్మక స్థావరం. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి 50 కి.మీ. దూరాన అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లిలో సముద్ర తీరాన్ని ఆనుకొని దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 670 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైన సహకారం అందిస్తోంది. దీని తొలి దశ నిర్మాణం 2022 నాటికి, మలి దశ నిర్మాణం 2025 నాటికి పూర్తి కావలసి ఉంది. కానీ కొవిడ్‌ వంటి కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు తొలి దశ నిర్మాణం పూర్తి కావొచ్చింది. రాంబిల్లికి సమీపాన అంటే 20 కి.మీ. దూరంలోనే అచ్యుతాపురంలో బాబా అటమిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) ఉంది. ఐఎన్‌ఎస్‌ వర్షకు అవసరమైన సహకారమంతా అక్కడి నుంచే అందుతుంది. బార్క్‌కు అచ్యుతాపురంలో 2,200 ఎకరాలు కేటాయించారు. అంటే ఇక్కడ భవిష్యత్తులో ఏ స్థాయిలో కార్యకలాపాలు జరగబోతున్నాయో ఊహించుకోవచ్చు. రాంబిల్లి స్థావరంలో అణు జలాంతర్గాముల నిర్మాణమే కాకుండా.. మరమ్మతులు, నిర్వహణ వంటి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఈ స్థావరంలో బంకర్లు, సొరంగ వ్యవస్థలు, ఇన్నర్‌, ఔటర్‌ హార్బర్‌ వంటి సౌకర్యాలున్నాయి. హైసెక్యూరిటీతో ఏర్పాటు చేస్తున్న ఈ వ్యూహాత్మక స్థావరం బంగాళాఖాతం, హిందూమహాసముద్ర ప్రాంతంలోని జలాల్లో నిఘాను పెంచనుంది. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా చర్యలపై నిఘా పెట్టేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పొరుగుదేశాలైన చైనా, పాకిస్థాన్‌ తన నౌకాదళాలను ఆధునీకరించుకుంటున్న నేపథ్యంలో భారత్‌ కూడా కొత్త నౌకా స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.


రాంబిల్లి ఎందుకంత ప్రత్యేకం..?

ఐఎన్‌ఎస్‌ వర్షను సబ్‌మెరైన్ల కోసమే నిర్మించారు. శత్రువుల కంట పడకుండా వాటిని రహస్యంగా దాచడానికి ఇలాంటి బేస్‌లను రష్యా, చైనా వంటి దేశాలు నిర్మించుకున్నాయి. ఆ కోవలోనే భారత్‌ కూడా రాంబిల్లిని వ్యూహాత్మక స్థావరంగా ఎంచుకుంది. చైనాకు దీటైన సమాధానం చెప్పడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇది భారత నౌకాదళానికి సబ్‌మెరైన్ల హబ్‌గా ఉంటుంది. నేవీ అధికారులు ఇందులో పనిచేస్తున్నప్పటికీ ఏ సబ్‌మెరైన్‌ ఎక్కడికి... ఎప్పుడు వెళ్లాలనే నిర్ణయాలను మాత్రం ఢిల్లీలోని స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌ నిర్ణయిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఢిల్లీ కనుసన్నల్లో ఈ హబ్‌ పనిచేస్తుంది. ఇక్కడ 12 సబ్‌మెరైన్లను డాక్‌ చేసుకోవచ్చు. అందులో అణు జలాంతర్గాములకే అధిక ప్రాధాన్యం. హైనాన్‌ ద్వీపం వద్ద చైనాకు చెందిన అణు జలాంతర్గామి స్థావరం తరహాలోనే.. రాంబిల్లి వద్ద నీటి లోతు ఎక్కువగా ఉంటుంది. దీంతో జలాంతర్గాములు ఉపగ్రహాల కంటపడకుండానే లోపలికి ప్రవేశించగలవు, బయటకు నిష్క్రమించగలవు. వాటిని శాటిలైట్లు గానీ, నిఘా విమానాలు గానీ కనిపెట్టే అవకాశం లేదు. సముద్రంలో టన్నెళ్లను నియమించి, వాటి ద్వారా సబ్‌మెరైన్లు హబ్‌కు చేరుకునేలా నిర్మాణం చేశారు. దీనికి పదేళ్లకుపైగా పట్టింది. 2014 ఆగస్టులో ఇక్కడ స్థావరాన్ని నిర్మిస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి.


ఈ ఏడాదిలోనే అర్థమాన్‌ అందుబాటులోకి..

విశాఖపట్నంలోని షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌లో 2004 నుంచి న్యూక్లియర్‌ సబ్‌మెరైన్ల నిర్మాణం జరుగుతోంది. స్ట్రాటజిక్‌ స్ట్రయిక్‌ న్యూక్లియర్‌ సబ్‌మెరైన్స్‌ (ఎస్‌ఎ్‌సబీఎన్‌) పేరుతో నాలుగు న్యూక్లియర్‌ సబ్‌మెరైన్ల నిర్మాణానికి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వెజల్‌ (ఏటీవీ) ప్రాజెక్టును 2004లో ప్రారంభించారు. ఇందులో మొదటిదైన అరిహంత్‌ నిర్మాణానికి రష్యా సహకారం తీసుకున్నారు. దీన్ని 2009లో లాంచ్‌ చేసి అనేక సీ ట్రయల్స్‌ అనంతరం 2016 ఆగస్టులో నేవీకి అందించారు. రెండోదైన ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ను 2017లో సీ ట్రయల్స్‌కు పంపించారు. గతేడాది ఆగస్టు 29న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. వీటిని ‘అరిహంత్‌ క్లాస్‌’ అణు జలాంతర్గాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో మిగిలిన రెండు సబ్‌మెరైన్ల నిర్మాణానికి రూ.40వేల కోట్లు ఇవ్వనున్నట్టు ఆరు నెలల క్రితం ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో నిర్మిస్తున్న మూడో న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ ఐఎన్‌ఎస్‌ అర్థమాన్‌. ఇది గతేడాది (2024) అక్టోబరులోనే సీ ట్రయల్స్‌కు వెళ్లింది. దీన్ని త్వరలో కమిషనింగ్‌ చేసి నేవీకి అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌, ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ కంటే అర్థమాన్‌ పెద్దగా ఉంటుంది. 7వేల టన్నుల సామర్థ్యం కలిని ఈ సబ్‌మెరైన్‌.. 3,500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల మరిన్ని కే-4 క్షిపణులను మోసుకెళ్లగలదు. దీని తర్వాత నిర్మిస్తున్న న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ను ప్రాజెక్ట్‌ ఎస్‌-4గా వ్యవహరిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇది కూడా నిర్మాణం పూర్తి చేసుకొని సీ ట్రయల్స్‌లో ఉంది.


పశ్చిమ తీరానికి కార్వార్‌.. తూర్పు తీరానికి వర్ష..

ప్రాజెక్ట్‌ సీబర్డ్‌లో భాగంగా కర్ణాటకలోని కార్వార్‌ స్థావరం పశ్చిమ తీరాన్ని కాపాడుతోంది. ఇదే తరహాలో ప్రాజెక్ట్‌ వర్ష ద్వారా రాంబిల్లి స్థావరం తూర్పు తీరానికి రక్షణగా నిలవనుంది. కార్వార్‌ నౌకాదళ స్థావరంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శనివారమే పలు ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను ప్రారంభించారు. తాజా పరిణామాలతో ఈ స్థావరంలో 32 నౌకలు, సబ్‌మెరైన్‌లతోపాటు మరికొన్ని నౌకలు అందుబాటులోకి రానున్నాయి.


ఇవి కూడా చదవండి..

TGSRTC: ఎండీకి నోటీసులు.. మోగనున్న సమ్మె సైరన్

Vaniya Agarwal: మైక్రోసాఫ్ట్‌ను అల్లాడించిన వానియా అగర్వాల్ ఎవరు

Rains: ఓరి నాయనా.. ఎండలు మండుతుంటే.. ఈ వర్షాలు ఏందిరా

Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..

Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..

Nara Lokesh: ‘సారీ గయ్స్‌..హెల్ప్‌ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్‌

LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..

Updated Date - Apr 08 , 2025 | 04:37 AM