తెలియనితనం...!
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:39 PM
దేనితో ఆటలాడుతున్నామో.. దాని ప్రభావమెంతో ఎరుగని పసిపిల్లలు వాళ్లు.. పెట్రోల్‌కు నిప్పు తోడైతే మంటలు చెలరేగుతాయని..

పెట్రోల్‌తో ఆటలాడిన ఇద్దరు చిన్నారులు
మంటలు వ్యాపించి ఓ బాలుడికి తీవ్ర గాయాలు
ఆస్పరి మండలం బిలేకల్‌లో ఘటన
ఆస్పరి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): దేనితో ఆటలాడుతున్నామో.. దాని ప్రభావమెంతో ఎరుగని పసిపిల్లలు వాళ్లు.. పెట్రోల్‌కు నిప్పు తోడైతే మంటలు చెలరేగుతాయని.. ప్రాణాలకే ప్రమాదం అనే విషయం ఏమాత్రం తెలియని వయసు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లాక ఇంటి సమీపంలో ఆడుకుంటూ రోడ్డు పక్కన ఆపిన మోటర్ బైక్‌లో నుంచి పెట్రోల్ తీశారు. ఓ ప్లాస్టిక్ సీసాలో పెట్రోల్ పోసుకుని ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఓ బాలుడు అగ్గిపుల్ల గీసివేయంతో క్షణాల్లో మంటలు వ్యాపించి ఎనిమిదేళ్ల పసిబాలుడు అరవింద్ శరీరమంతా చుట్టిముట్టాయి. ఈ సంఘటన ఆస్పరి మండలం బిల్లేకల్లు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకోగా సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, బాధిత చిన్నారి అరవింద్‌కు వరుసకు సోదరుడైన రామకృష్ణ తెలిపిన మేరకు వివరాలు... బిల్లేకల్లు గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, పెద్దయ్య దంపతులకు కుమార్తె పల్లవి, అరవింద్ సంతానం. మద్యానికి బానిసై లక్ష్మీదేవి భర్త పెద్దయ్య ఆరు నెలల క్రితం మృతి చెందాడు. భర్తను కోల్పోయిన లక్ష్మీదేవి అన్నితానై పిల్లలను పోషిస్తోంది. అరవింద్‌ను బడిలో చేర్పించాలని వెళితే ఆధార్ కార్డు లేదని స్థానిక మండల పరిషత ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అడ్మిషన ఇవ్వలేదు. అయినా అక్క పల్లవితో కలిసి రోజు బడికి వెళ్లేవాడు. అదే గ్రామానికి చెందిన హెచ. ఉరుకుందు కుమారుడు వికాస్ నాలుగో తరగతి చదువుతున్నారు. కాగా వికాస్, అరవింద్ ఇద్దరూ మంచి స్నేహితులు. గత శుక్రవారం లక్ష్మీదేవి కూలీ పనులకు వెళ్లింది. అక్కతో పాటు బడికి వెళ్లిన అరవింద్ మధ్యాహ్నం బయటకు వచ్చేశాడు. మిత్రుడు వికాశతో కలసి ఆడుకుంటూనే.. రోడ్డు పక్కన ఆపిన ద్విచక్ర వాహనంలో (మోటర్ బైక్) నుంచి పెట్రోల్ తీసి.. ఆ పెట్రోల్‌ను చెరో ప్లాస్టిక్ సీసాలో పోసుకొని.. ఆ సీసా మూతకు సూదితో రంధ్రం చేసుకొని ఒకరిపై ఒకరు రంగుల్లాగా చల్లుకున్నారు. ఆ క్రమంలో కింద పడిన పెట్రోల్‌కు ఆగ్గిపుల్ల వెలిగించి నిప్పు పెడితే అది ఆరిపోయింది. అట్లాగే మనిషిపై పడితే కూడా ఆరిపోతుం దనుకొని వికాశ అగ్గిపుల్ల వెలిగించి.. అరవింద్‌పై వేశాడని స్థానికుల సమాచారం. మంటలు వ్యాపించడమే కాకుండా, జేబులో ఉంచుకున్న పెట్రోల్ సీసాకు కూడా మంటలు చేరి ఒక్కసారిగా భగ్గుమని శరీరమంతా వ్యాపించాయి. అయితే స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. చిన్నారి వికాశ ఏమాత్రం భయపడకుండా ధైర్యంతో నీళ్లు తీసుకొచ్చి అరవింద్ శరీరంపై పోయడంతో మంటలు ఆరిపోయాయి. కూలి పనులకు వెళ్లిన తల్లి లక్ష్మీదేవికి విషయం తెలియడంతో విలపిస్తూ ఇంటికి చేరుకుంది. బంధువుల సహాయంతో ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరవింద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఇద్దరు పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఈ ఘటన జరిగిందని అరవింద్ సోదరుడు రామకృష్ణ ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఆస్పరి పోలీస్ స్టేషన సీఐ మస్తానవలి దృష్టికి తీసుకెళ్లగా ఇద్దరు పిల్లలు పెట్రోల్‌తో సరదాగా అడుకుంటూ ప్రమాదానికి గురై అరవింద్ అనే బాలుడు శరీరం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరారని సమాచారం వచ్చిందన్నారు. ఈ ఘటనపై ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదన్నారు.