Share News

నచ్చకుంటే 22ఏనే!

ABN , Publish Date - Jan 05 , 2025 | 12:48 AM

గత వైసీపీ ప్రభుత్వం గుడివాడ నియోజకవర్గం పరిధిలోని వందలాది ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి రైతులకు ఝలక్‌ ఇచ్చింది. మాజీ మంత్రి కొడాలి నాని మాట వినని, తనకు అనుకూలంగా లేని వారి భూములే లక్ష్యంగా 22ఏ అస్త్రాన్ని ప్రయోగించారు. అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ సహకారంతో తమ భూములను నిషేధిత జాబితాలో చేర్చారని రైతులు ఆరోపిస్తున్నారు. 22ఏ జాబితా నుంచి తొలగించాలని గత రెండున్నరేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాకతో భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ సదస్సుల్లో తమకు న్యాయం జరుగుతుందని కోటి ఆశలతో వేచిచూస్తున్నారు.

నచ్చకుంటే 22ఏనే!

- వైసీపీ పాలనలో వందలాది ఎకరాలు నిషేధిత జాబితాలోకి..

- రైతులపై ‘22ఏ’ అస్త్రం ప్రయోగించిన కొడాలి నాని

- లింగవరం లేఅవుట్‌లో నిర్మాణాలు చేపట్టకుండా 22ఏ అస్త్రంతో కుట్ర

- గుడివాడ నియోజకవర్గంలో గడ్డం గ్యాంగ్‌ అరాచకాలు ఎన్నెన్నో..

- రెండేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు

- మాజీ మంత్రి నిర్వాకంపై సర్వత్రా విమర్శలు

- నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి

- కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులపైనే రైతుల ఆశలు

గత వైసీపీ ప్రభుత్వం గుడివాడ నియోజకవర్గం పరిధిలోని వందలాది ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి రైతులకు ఝలక్‌ ఇచ్చింది. మాజీ మంత్రి కొడాలి నాని మాట వినని, తనకు అనుకూలంగా లేని వారి భూములే లక్ష్యంగా 22ఏ అస్త్రాన్ని ప్రయోగించారు. అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ సహకారంతో తమ భూములను నిషేధిత జాబితాలో చేర్చారని రైతులు ఆరోపిస్తున్నారు. 22ఏ జాబితా నుంచి తొలగించాలని గత రెండున్నరేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాకతో భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ సదస్సుల్లో తమకు న్యాయం జరుగుతుందని కోటి ఆశలతో వేచిచూస్తున్నారు.

ఆంధ్రజ్యోతి - గుడివాడ:

గుడివాడ నియోజకవర్గంలోని రైతులపై మాజీ మంత్రి కొడాలి నాని కక్ష సాధింపు చర్యలకు దిగారు. తను చెప్పిన ప్రాజెక్టులకు భూములు ఇవ్వలేదని, తనకు అనుకూలంగా లేరని కొందరు రైతుల భూములను రెవెన్యూ అధికారులతో మాట్లాడి 22ఎ నిషేధిత జాబితాలో చేర్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయా బాధిత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాటి వైసీపీ పాలన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిషేధిత జాబితాలో చేర్చిన భూములు ఇవే..

- గుడివాడ మండలం వలివర్తిపాడు గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌ 86లో సుమారు 400 మంది సన్న, చిన్నకారు రైతులకు చెందిన 445.75 ఎకరాల భూమిని ఎం.ఐ.జి(మిడిల్‌ ఇన్‌కామ్‌ గ్రూప్‌) ప్రాజెక్టు కోసం సేకరించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తాము సూచించిన ధరకు భూములను అమ్మలేదనే అక్కసుతో ఆ నాటి మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని జిల్లా జాయింట్‌ కలెక్టర్ల సహకారంతో 445.75 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్పించారని సమాచారం. ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చకపోవడంతో తమ భూములను నిషేధ జాబితా నుంచి తొలగించాలని గత వైసీపీ హయాంలో చిన్న,సన్నకారు రైతులు పలు మార్లు ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రాలను సమర్పించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం రాకతో రైతులు తిరిగి ఆర్డీవోకు వినతి పత్రాలు అందించారు. స్పందించిన ఆర్డీవో నివేదికను కలెక్టర్‌కు పంపారు.

- గుడివాడ మండలం వలివర్తిపాడులోని రీసర్వే నెం.180లో తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మధ్యతరగతి వారికి చెందిన 66కుపైగా ప్లాట్‌లను మాజీ మంత్రి కొడాలి నాని తన గడ్డం గ్యాంగ్‌ ద్వారా కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాకతో తిరిగి ఆ ప్లాట్‌లు లబ్ధిదారుల చేతికి వచ్చాయి. అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. వీటిని కూడా అప్పటి వైసీపీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. స్థల యజమానులు తమ ప్లాట్‌లను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

- గుడివాడ మండలం లింగవరంలో సుమారు 40 ఎకరాల భూమిని వైసీపీ హయాంలో నిషేధిత జాబితాలో చేర్చారు. వందల ఏళ్లుగా భూమి తమ ఆధీనంలో ఉందని, నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి నివేదిక వెళ్లినట్లు సమాచారం.

- గుడివాడ మండలం లింగవరం పంచాయతీలో మాజీ మంత్రి కొడాలి నాని మరికొందరితో కలిసి సర్వే నంబర్లు 239/1బి, 2, 240/1బి, 3, 244/1, 2ఎ, 2బి, 3, 4, 5, 245/1, 2, 3, 246, 247/1, 2, 3లలో 25.44 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్‌ వేశారు. అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా ఉండేందుకు ఆ భూములను సైతం 22ఏలో చేర్చారు. దీంతో సదరు లేఅవుట్‌లో సుమారు 100 ప్లాట్‌లు కొనుగోలు చేసిన యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇల్లు నిర్మించుకుందామంటే వీలుపడటం లేదని వాపోతున్నారు. కలెక్టర్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు.

- నందివాడ మండలం తుమ్మలపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెం.78/1సిలో మూడు ఎకరాల సీలింగ్‌ భూమి ఉంది. గత వైసీపీ ప్రభుత్వం రీసర్వే పేరుతో సదరు సర్వే నంబర్‌లోని మూడు ఎకరాలకు బదులు 13 ఎకరాలను సీలింగ్‌ భూమిగా పేర్కొని 22ఎ నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ విషయమై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిషేధిత జాబితా నుంచి తమ భూములను తొలగించాలని రైతులు పెట్టిన అర్జీలన్నీ బుట్టదాఖలయ్యాయి. 10 ఎకరాల్లో భూమి కలిగిన వారంతా సన్న, చిన్నకారు రైతులు కావడం గమనర్హం. నిషేధిత జాబితా నుంచి 10 ఎకరాలను తొలగించి తమను ఆదుకోవాలని కలెక్టర్‌ను కోరుతున్నారు.

Updated Date - Jan 05 , 2025 | 12:48 AM