RWSS: ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల అవినీతి దాహం
ABN , Publish Date - Feb 01 , 2025 | 05:34 AM
గ్రామీణ నీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూఎస్) విభాగంలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ప్రజల దాహార్తిని తీర్చే కేంద్ర ప్రాయోజిత పథకమైన జల్ జీవన్ మిషన్(జేజేఎం)ను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తమ అవినీతి దాహాన్ని తీర్చుకునేందుకు వాడుకున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా నిధులను డ్రా చేసుకుని అక్రమాలకుపాల్పడ్డారు. విజయవాడలోని రింగ్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు బ్యాంక్‌లో ప్రత్యేకంగా తెరచిన ఖాతాలోని జేజేఎం 5 శాతం గ్రాంట్ నిధులను అడ్డగోలుగా వాడేయడంపై తాజాగా ఏసీబీ డీజీకి ఫిర్యాదు అందడంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
జల్‌జీవన్ మిషన్ నిధులను మింగేసిన వైనం
ఖర్చుల కోసం వెచ్చించాల్సిన 5% నిధులకు చిల్లు
నాలుగు రోజుల్లో 400 లావాదేవీల ద్వారా సొమ్ము స్వాహా
ప్రభుత్వ ఖాతాలోకి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా నగదు జమ
సాక్ష్యాధారాలతో ఏసీబీకి అందిన ఫిర్యాదు
మొత్తం జగన్ హయాంలో ఇంకెంత నొక్కేసారో తేల్చాలని వినతి
విజయవాడ, జనవరి 31(ఆంధ్రజ్యోతి): గ్రామీణ నీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూఎస్) విభాగంలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ప్రజల దాహార్తిని తీర్చే కేంద్ర ప్రాయోజిత పథకమైన జల్ జీవన్ మిషన్(జేజేఎం)ను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తమ అవినీతి దాహాన్ని తీర్చుకునేందుకు వాడుకున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా నిధులను డ్రా చేసుకుని అక్రమాలకుపాల్పడ్డారు. విజయవాడలోని రింగ్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు బ్యాంక్‌లో ప్రత్యేకంగా తెరచిన ఖాతాలోని జేజేఎం 5 శాతం గ్రాంట్ నిధులను అడ్డగోలుగా వాడేయడంపై తాజాగా ఏసీబీ డీజీకి ఫిర్యాదు అందడంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర మ్యాచింగ్ గ్రాంట్‌తో జేజేఎం పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తారు. ఈ పథకం గ్రాంట్‌లో 5 శాతం నిధులను ఆర్‌డబ్ల్యూఎస్ విభాగంలో స్టేషనరీ, ఇతర ఖర్చుల కోసం వినియోగించుకోవచ్చు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు అధికారులు ఈ ఐదు శాతం నిధులను భారీగా పక్కదారి పట్టించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ నిధులను ఎడాపెడా వాడేశారు. వైసీపీ ప్రభుత్వ జమానాలో 2024వ సంవత్సరం జనవరి 1, 15, 24, 30 తేదీలలో కేవలం నాలుగు రోజులలోనే 400 ట్రాన్సాక్షన్ల ద్వారా ఈ ఐదు శాతం నిధులను సొంత అవసరాలకు వాడేశారు. గత నాలుగేళ్ళుగా మిగిలిన రోజులలో ఏ రేంజ్‌లో జేజేఎం గ్రాంట్ నిధులను చప్పరించేశారో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఈ ఖాతాలో వేల సంఖ్యలో లావాదేవీలు జరిగాయని తెలుస్తోది. దీనిని బట్టి కోట్లాది రూపాయలను డ్రా చేసినట్టుగా అర్థమవుతోంది. ఈఎన్‌సీ ఆఫీసు, ఎస్‌ఈ, ఈఈ అవసరాలకు కాకుండా వేర్వేరు ఖాతాలకు నిధుల బదలాయింపు భారీగా జరిగిందని సమాచారం.
ఇదొక్కటే కాదు... మరికొన్ని ఖాతాల నుంచీ..!
జేజేఎం పథకం కంటే ముందు నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ (ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) గ్రాంట్ 3 శాతం నిధులకు సంబంధించిన ఖాతా నుంచి నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా డబ్బులు డ్రా చేశారని తెలుస్తోంది. దీంతో పాటు తాజాగా స్టేట్ వాటర్ శానిటేషన్ మిషన్ (ఎస్‌డబ్ల్యూఎ్‌సఎం) పథకం గ్రాంట్‌కు కూడా భవానీపురంలోని ఓ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ ఖాతా నుంచి కూడా అడ్డగోలుగా డబ్బులు సొంత అవసరాలకు డ్రా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాకుండా వాటర్ గ్రిడ్ ఖాతా నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పట్టాయని తెలుస్తోంది. 2019-24 మధ్య కాలంలో ఈ ఖాతాలకు సంబంధించిన లావాదేవీలన్నింటినీ పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా జరిగిందా లేదా అన్నది పరిశీలిస్తే దొంగ లావాదేవీలు దొరికిపోతాయి.
జేజేఎం ఖాతాలోకి ప్రైవేట్ వ్యక్తుల నుంచి సొమ్ములు!
కొంతమంది ప్రైవేటు వ్యక్తుల నుంచి కూడా ఇదే ఖాతాకు నిధులు బదిలీ కావటం గమనార్హం. ఒక నిర్దిష్టమైన ప్రభుత్వ ఖాతాకు ప్రైవేటు వ్యక్తుల నుంచి ఫోన్‌పేల ద్వారా డబ్బులు జమ అవుతున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారుల ప్రత్యేక ఆదేశాలు లేకుండా కిందిస్థాయి సిబ్బందితో ఈ ఖాతాలోని డబ్బులను ఎప్పుడు పడితే అప్పుడు డ్రా చేయించినట్టుగా తెలుస్తోంది. ఆర్‌డబ్ల్యూఎస్ నిబంధనల ప్రకారం రూ.5 వేల కంటే ఎక్కువ డబ్బులు డ్రా చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఎమ్ బుక్‌లో నమోదు చేయాలి. దీనికి సంబంధించి జేఈ రికార్డు చేయాలి. ఆ తర్వాత ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ చెక్ మెజర్‌మెంట్ చేయాలి. ప్రతి చెక్కుకు జీఎ్‌సటీ, ఐటీ మినహాయించాల్సి ఉంటుంది. ఇవన్నీ లేకుండానే బ్యాంకు ఖాతా నుంచి పెద్ద ఎత్తున డబ్బులు డ్రా చేశారు. ఇది తీవ్రమైన నేరం. కొంతమంది చీఫ్ ఇంజనీర్లకు కూడా ఇందులో వాటాలు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాలను పర్యవేక్షించే సూపరింటెండెంట్ ద్వారా అడ్డగోలుగా చెల్లింపు లావాదేవీలు నడిచినట్టుగా తెలుస్తోంది. ఆ ఉద్యోగి ఫోన్‌పే, గూగుల్ పేల ద్వారానే ఎక్కువ లావాదేవీలు నడిచాయని కూడా ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది.
For AndhraPradesh News And Telugu News