Capital Construction : అమరావతికి హడ్కో రుణం 11 వేల కోట్లు
ABN , Publish Date - Jan 23 , 2025 | 04:25 AM
రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి హౌసింగ్ అండ్ అర్బన్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(హడ్కో) రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.
బోర్డు సమావేశంలో నిర్ణయం.. టిడ్కో ఇళ్లకు రూ.4,400 కోట్లు
మంత్రి నారాయణ వెల్లడి
అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి హౌసింగ్ అండ్ అర్బన్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(హడ్కో) రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. హడ్కో ద్వారా రూ.11 వేల కోట్ల రుణం కోసం ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందని గుర్తు చేశారు. ఇందుకు హడ్కో సానుకూలంగా స్పందించిందన్నారు. హడ్కో నిర్ణయంతో రాజధాని అమరావతి పనులు వేగవంతమవుతాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే సమాధానం చెప్పలేని పరిస్థితిని కల్పించిందన్నారు. కేంద్రంలో ఎన్డీయే సర్కార్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో కూడా అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయిస్తోందన్నారు.
టిడ్కోకు రుణాలు
అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసేందుకు, ఇళ్ల సముదాయాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు టిడ్కోకు హడ్కో 4,400 కోట్ల రుణం మంజూరు చేసిందని మంత్రి నారాయణ తెలిపారు. ఈ నిధులతో పనులు చేపట్టి టిడ్కో ఇళ్ల సముదాయాలను నివాసయోగ్యంగా తయారు చేయవచ్చని తెలిపారు.