Iron Ore: నెల్లూరులో నాణ్యమైన ఇనుప ఖనిజం
ABN , Publish Date - Jul 25 , 2025 | 02:48 AM
ఇనుము తయారీలో మాగ్నటైట్ ఒక ముఖ్యమైన ముడిపదార్థం. దీనిలో ఇనుము శాతం అధికంగా ఉంటుంది. దీన్ని శుద్ధి చేయడం కూడా సులభం.
లింగసముద్రం, వలేటివారిపాలెం మండలాల్లో
అత్యంత నాణ్యమైన మాగ్నటైట్ ఐరన్ ఓర్ గుర్తింపు
21.87 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిక్షేపాలు
10 మీటర్ల లోతులోనే ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది
150-200 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్‌కు నిర్ణయం
ముమ్మరంగా పనులు చేపడుతున్న జేఎస్‌డబ్ల్యూ
కందుకూరు, జూలై 24(ఆంధ్రజ్యోతి): ఇనుము తయారీలో మాగ్నటైట్ ఒక ముఖ్యమైన ముడిపదార్థం. దీనిలో ఇనుము శాతం అధికంగా ఉంటుంది. దీన్ని శుద్ధి చేయడం కూడా సులభం. అలాంటి అత్యంత నాణ్యమైన మాగ్నటైట్ ఐరన్ ఓర్ నిక్షేపాలు నెల్లూరు జిల్లా లింగసముద్రం, వలేటివారిపాలెం మండలాల్లో పుష్కలంగా ఉన్నట్టు జేఎ్‌సడబ్ల్యూ కంపెనీ తనిఖీల్లో గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ రెండు మండలాల పరిధిలోని 10 గ్రామాల్లో 21.87 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇనుప ఖనిజం నిక్షేపాలున్నట్టు గతంలో నేషనల్ జియోగ్రాఫికల్ సర్వేలో తేలింది. దీంతో ఈ ప్రాంతంలో ఐరన్ ఓర్ శోధన, మైనింగ్ కోసం కాంపోసైట్ లైసెన్సు పొందిన జేఎస్‌డబ్ల్యూ.. వారం రోజులుగా క్వాలిటీ నిర్ధారణకు డ్రిల్లింగ్ పనులు ముమ్మరం చేసింది. సాధారణంగా ఐరన్‌ఓర్ నాణ్యతను నాలుగు రకాలుగా విభజిస్తారు. 70 శాతం కన్నా ఎక్కువ ఇనుము కలిగిన ముడిసరుకును మాగ్నటైట్ ఓర్‌గా, 60 నుంచి 70 శాతం వరకు ఇనుము ఉంటే హెమటైట్ రకంగా, 40 నుంచి 60 శాతం వరకు ఉంటే లైమోటైట్‌గా, అంతకన్నా తక్కువ ఉంటే సైడ్‌రైట్‌గా పరిగణిస్తారు. వీటిలో మాగ్నటైట్, హెమటైట్ రకం ఐరన్‌ఓర్ ఉంటేనే మైనింగ్‌కు ఆసక్తి చూపుతారు. మిగిలిన రెండు క్వాలిటీలకు తగినంత గిట్టుబాటు ఉండదు. ప్రస్తుతం వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాల పరిధిలో ఉన్న ఐరన్‌ఓర్ మాగ్నటైట్ రకమని సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. జేఎస్‌డబ్ల్యూకంపెనీకి 2023లో వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాల్లోని పది గ్రామాల పరిధిలో 21.87 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐరన్‌ఓర్ క్వాలిటీని చెక్ చేసుకునేందుకు వీలుగా బిడ్డింగ్ పద్ధతిలో కాంపోసైట్ లైసెన్సు మంజూరు చేశారు.
లింగసముద్రం మండలం అద్దంకివారిపాలెం ఐరన్‌ఓర్ బ్లాక్ 9.14 కిలోమీటర్లలో విస్తరించి ఉండగా ఇందులో లింగసముద్రం, తిమ్మారెడ్డిపాలెం, ఆర్‌ఆర్ పాలెం, జంగంరెడ్డి కండ్రిక గ్రామాల పరిధిలోని కొండలు, ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఉన్నాయి. అలాగే వలేటివారిపాలెం మండలంలోని చుండి, అయ్యవారిపల్లి, పోలినేనిచెరువు గ్రామాల పరిధిలోకి వచ్చే కొండలు, ఇనాం భూములు, పట్టా భూములు, ప్రభుత్వ పోరంబోకు భూములను లక్ష్మక్కపల్లి నార్త్ ఐరన్‌ఓర్ బ్లాక్‌గా పరిగణిస్తున్నారు. దీని పరిధిలో వలేటివారిపాలెం మండలంతోపాటు పీసీ పల్లి, పామూరు మండలాల్లోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ బ్లాక్ 11.947 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఈ రెండు బ్లాకులు కలిపి 21.87 చదరపు కిలోమీటర్లు కాగా ఇందులో రిజర్వ్ ఫారెస్టు భూములు కూడా ఉన్నాయి.
10 మీటర్ల నుంచే ఐరన్ ఓర్
అద్దంకివారిపాలెం ఐరన్ ఓర్ బ్లాక్, లక్ష్మక్కపల్లి నార్త్ ఐరన్ ఓర్ బ్లాక్‌లలో 10 మీటర్లలోతు నుంచే ఐరన్ ఓర్ నిక్షేపాలున్నట్లు డ్రిల్లింగ్ చేస్తున్న సిబ్బంది గుర్తించారు. 20 మీటర్లు దాటిన తర్వాత నాణ్యమైన ఓర్ పడుతున్నట్టు తెలిసింది. కొన్ని ప్రాంతాల్లో 150 మీటర్ల లోతు వరకు నిక్షేపాలున్నట్టు గుర్తించారు. తొలుత 100 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేయాలని ఆపై దాన్ని 150-200 మీటర్ల వరకు పెంచాలని ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి
Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..
Read latest AP News And Telugu News