High Court: వాస్తవాలు దాచేందుకు మరిన్ని తప్పులు
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:39 AM
సోషల్ మీడియా అనుచిత పోస్టుల వ్యవహారంలో నిందితుడు బోస రమణ అరెస్టుపై పోలీసులు వాస్తవాలు చెప్పకుండా దాచిపెట్టేందుకు మరిన్ని తప్పులు చేస్తున్నారని హైకోర్టు మంగళవారం ఘాటుగా వ్యాఖ్యానించింది.

సోషల్ మీడియా పోస్టుల కేసులో రమణ అరెస్టుపై విశాఖ సీపీ, ప్రకాశం ఎస్పీ భిన్న వివరాల సమర్పణ
రాతపూర్వక ఉత్తర్వులు ఇస్తేనే నివేదిక ఇస్తారా?
డీజీపీ పోస్టుపై గౌరవంతో హాజరుకు ఆదేశించట్లేదు
పోలీసులపై హైకోర్టు అసహనం.. ఘాటు వ్యాఖ్యలు
అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియా అనుచిత పోస్టుల వ్యవహారంలో నిందితుడు బోస రమణ అరెస్టుపై పోలీసులు వాస్తవాలు చెప్పకుండా దాచిపెట్టేందుకు మరిన్ని తప్పులు చేస్తున్నారని హైకోర్టు మంగళవారం ఘాటుగా వ్యాఖ్యానించింది. రమణను విశాఖలోని ఆయన ఇంటి వద్ద ప్రకాశం జిల్లా పొదిలి పోలీసులు అరెస్ట్ చేశారని విశాఖ పోలీస్ కమిషనర్.. విశాఖలోని ఎంవీపీ పోలీ్‌సస్టేషన్ వద్ద అరెస్ట్ చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ భిన్నమైన వివరాలు సమర్పించడంపై అసహనం వ్యక్తం చేసింది. రమణ అరె్‌స్టపై డీజీపీ నివేదిక దాఖలు చేయకపోవడాన్ని ఆక్షేపించింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని నివేదిక సమర్పించాలని కోరామని, అయితే డీజీపీ పోస్టుపై ఉన్న గౌరవంతో తమ ముందు హాజరుకు ఆదేశాలు ఇవ్వకుండా ఆగుతున్నామని పేర్కొంది. రాతపూర్వక ఉత్తర్వులు ఇస్తేనే నివేదిక దాఖలు చేస్తామంటే అందుకు సిద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో సహాయ ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థన మేరకు విచారణను మార్చి 11కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. తన భర్త బోస రమణను పొదిలి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపర్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ బోస లక్ష్మి గత ఏడాది నవంబరులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. రమణ అరె్‌స్టపై నివేదిక ఇవ్వాలని ప్రకాశం జిల్లా ఎస్పీ, వైజాగ్ సీపీని ఆదేశించింది. ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని డీజీపీకి స్పష్టం చేసింది. కాగా, మంగళవారం విచారణలో విశాఖ సీపీ దాఖలు చేసిన నివేదికలో పొదిలి పోలీసులు రమణను విశాఖలోని ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేసి విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్‌కు తరలించారని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సమర్పించిన నివేదికలో నోటీసులు ఇచ్చేందుకు రమణ ఇంటికి వెళ్లగా.. బంధువులు, కుటుంబసభ్యులు గొడవ చేశారని, దీంతో అతన్ని ఎంవీపీ పోలీ్‌సస్టేషన్‌కు తరలించామని, అక్కడకు కూడా వచ్చి గొడవ చేయడంతో రమణను అరెస్ట్ చేసి పొదిలికి తరలించినట్లు పేర్కొన్నారు. మరోవైపు తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని వర్రా రవీందర్‌రెడ్డి భార్య కళ్యాణి వేసిన పిటిషన్‌లో కడప జిల్లా అప్పటి ఇంచార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడిని హైకోర్టు సుమోటో ప్రతివాదిగా చేర్చింది. ఎస్పీ విద్యాసాగర్‌పై కేసులోని సహ నిందితులు(థర్డ్ పార్టీ) నిర్దిష్ట ఆరోపణలు చేస్తున్న నేపధ్యంలో తన వాదన వినిపించేందుకు వీలుగా ఆయన్ను ప్రతివాదిగా చేరుస్తున్నట్లు పేర్కొంది. కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ విచారణను మార్చి 10కి వాయిదా వేసింది.