High Court : రాజ్ కసిరెడ్డికి ఝలక్
ABN , Publish Date - May 09 , 2025 | 06:02 AM
మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఎసీబీ కోర్టు రిమాండ్ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది
ఏసీబీ కోర్టు రిమాండ్ ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ
ఆయన తండ్రి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ కొట్టివేత
అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం వ్యవహారంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తన కుమారుడికి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఉపేందర్‌రెడ్డి వ్యాజ్యంపై బుధవారం ధర్మాసనం విచారణ జరిపింది. సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాజ్ కసిరెడ్డి అరెస్టు విషయంలో సీఐడీ అధికారులు చట్టనిబంధనల మేరకే నడుచుకున్నారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో నిర్ణయాన్ని వాయిదా వేసిన ధర్మాసనం.. గురువారం వెల్లడించింది. ‘రిమాండ్ రిపోర్టును నిందితుడికి అందజేసినట్లు ఏసీబీ న్యాయాధికారి రిమాండ్ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్టుపై కసిరెడ్డి సంతకం కూడా ఉంది. నిబంధనలను అధికారులు అనుసరించారు. రిమాండ్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం’ అని కోర్టు పేర్కొంది