Speed Breakers: స్పీడ్ బ్రేకర్ల’పై ఐఆర్‌సీ మార్గదర్శకాలు తప్పనిసరి
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:24 AM
రాష్ట్ర హైవేలు, జిల్లా ప్రధాన రోడ్లు, గ్రామీణ రోడ్లపై స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు విషయంలో కేంద్ర రవాణాశాఖ, ఇండియన్ రోడ్...
ఇప్పటికే ఉన్నవాటిని మార్చండి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైవేలు, జిల్లా ప్రధాన రోడ్లు, గ్రామీణ రోడ్లపై స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు విషయంలో కేంద్ర రవాణాశాఖ, ఇండియన్ రోడ్ కాంగ్రె్‌స(ఐఆర్‌సీ) మార్గదర్శకాలను తూ.చ. తప్పకుండా అమ లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. పిటిషనర్ వినతిని పరిగణనలోకి తీసుకొని రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లను తొలగించడం/ఐఆర్‌సీ మార్గదర్శకాలకు అనుగుణంగా మార్చాలని రాష్ట్రంలోని సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు రాష్ట్ర రోడ్లు-భవనాలశాఖ చీఫ్ ఇంజనీర్ మెమో జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. న్యాయవాది తాండవ యోగేష్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మేరకు ఈ ఆదేశాలిచ్చింది. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా.. ఇండియన్ రోడ్ కాంగ్రె్‌స-1996 ప్రకారం ప్రతి స్పీడ్ బ్రేకర్ 3.7 మీటర్ల వెడ ల్పు, 0.10 మీటర్ల ఎత్తు ఉండాలన్నారు. స్పీడ్ బ్రేకర్ బంప్ 17 మీటర్ల వ్యాసార్ధం ఉండడంతో పాటు స్పష్టంగా కనిపించేలా తెలుపు, పసుపు రంగులు వేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌జీపీ ఎస్.ప్రణతి వాదనలు వినిపిస్తూ.. స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు విషయంలో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ కొత్త మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం.. ఐఆర్‌సీ కొత్త మార్గదర్శకాలు ఏమైనా ఇచ్చి ఉంటే, ఇకపై వేసే స్పీడ్ బ్రేకర్లతో పాటు ఇప్పటికే రోడ్లపై ఉన్నవాటిని వాటికి అనుగుణంగా మార్చాలంది.