Share News

High Court : ఆ గ్రామాలన్నీ ఎలా మాయమయ్యాయి?

ABN , Publish Date - Jan 23 , 2025 | 04:13 AM

విజయనగరం జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో షెడ్యూల్డ్‌ ఏరియా నుంచి వందల గ్రామాలను తొలగించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. గతంలో షెడ్యూల్డ్‌ ఏరియాలో 792 గ్రామాలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 292కి తగ్గిందని, మిగిలిన గ్రామాలు ఎలా

 High Court : ఆ గ్రామాలన్నీ ఎలా మాయమయ్యాయి?

షెడ్యూల్డ్‌ ఏరియా పరిధిని ఎందుకు కుదిస్తున్నారు: హైకోర్టు

అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో షెడ్యూల్డ్‌ ఏరియా నుంచి వందల గ్రామాలను తొలగించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. గతంలో షెడ్యూల్డ్‌ ఏరియాలో 792 గ్రామాలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 292కి తగ్గిందని, మిగిలిన గ్రామాలు ఎలా మాయమయ్యాయని ప్రశ్నించింది. షెడ్యూల్డ్‌ ఏరియాను ఎందుకు, ఏ అధికారంతో కుదిస్తున్నారో చెప్పాలని నిలదీసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిని ఆదేశించింది. లేనిపక్షంలో తదుపరి విచారణ కు ఆన్‌లైన్‌ ద్వారా కోర్టు ముందు హాజరుకావాలని ఆ శాఖ కార్యదర్శికి స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. ఆ జిల్లాలోని గమ్మలక్షీపురం, జీయమ్మవలస, కొమరాడ, కురుపాం, పార్వతీపురం, మక్కువ, సాలూరు, పాచిపెంట మండలాల పరిధిలో గిరిజనేతరులకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా షెడ్యూల్డ్‌ ఏరియా హద్దులను ఇష్టారీతిన మారుస్తున్నారంటూ ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవల్‌పమెంట్‌ సొసైటీ అధ్యక్షుడు టి.వెంకటశివరామ్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎ.శ్యాం సుందర్‌రెడ్డి వాదనలు వినిపించగా, కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌(డీఎ్‌సజీ) పసల పొన్నారావు స్పందించారు.

Updated Date - Jan 23 , 2025 | 04:13 AM