High Court Emphasizes: ప్రోత్సాహకాలివ్వకుంటే ఏ కంపెనీ వస్తుంది
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:48 AM
ప్రఖ్యాత కంపెనీలను ఆకర్షించి విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా మార్చే ఆలోచనతోనే రాష్ట్రప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీలు..
బెంగళూరో, హైదరాబాదో తరలిపోతాయి: హైకోర్టు
విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ ఆలోచన
పెట్టుబడులను ఆకర్షించేందుకే ప్రోత్సాహకాలు
కంపెనీల ఏర్పాటుతో ఉద్యోగాలు వస్తాయి
రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ పెరుగుతుంది
నామమాత్రపు రేటుతో భూకేటాయింపును సంకుచిత దృష్టితో చూడకండి
తద్వారా వచ్చే ప్రయోజనాలనూ పరిగణనలోకి తీసుకోవాలి
పెట్టుబడులు రాకుంటే వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోతుంది
కాగ్నిజెంట్‌కు భూకేటాయింపుపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి ఆదేశం
అమరావతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత కంపెనీలను ఆకర్షించి విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా మార్చే ఆలోచనతోనే రాష్ట్రప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీలు ముందుకొస్తాయని ప్రశ్నించింది. సంస్థలన్నీ హైదరాబాద్, బెంగళూరుకు తరలివెళ్తాయని పేర్కొంది. ప్రఖ్యాత కంపెనీలను ఆకర్షించాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్ప మరోమార్గం లేదని వ్యాఖ్యానించింది. నామమాత్రపు ధరతో భూకేటాయింపును సంకుచిత దృష్టితో చూడకూడదని, తద్వారా వచ్చే ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టంచేసింది. ఐటీ సంస్థలు రావడం వల్ల యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ కూడా పెరుగుతుందని గుర్తు చేసింది. పెట్టుబడులు రాకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోతుందని, ఖాళీ భూములు తప్ప ఇక్కడ ఏమీ ఉండవని పేర్కొంది. ప్రస్తుత ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్).. వివిధ సంస్థలకు భూకేటాయింపులను సవాల్ చేస్తూ వేసిన పిల్స్‌కు జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. భూకేటాయింపు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖపట్నంలో మధురవాడ పరిధిలో కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 22.19 ఎకరాలను ఎకరా 99 పైసలకే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 1న జారీ చేసిన జీవో 21ని సవాల్ చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ రైట్స్(ఎ్‌సపీసీపీఈఆర్) విశాఖ జిల్లా అధ్యక్షురాలు నక్కా నమ్మి గ్రేస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా.. గ్రేస్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. విశాఖ నడిబొడ్డున రూ.1,109 కోట్లు విలువ చేసే స్థలాన్ని కాగ్నిజెంట్‌కు 99 పైసలకే సేల్ డీడ్ ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. సేల్ డీడ్ ద్వారా భూమిని విక్రయించేందుకు ఏపీఐఐసీ నిబంధనలు అనుమతించవని.. లీజు పద్ధతిలో భూకేటాయింపులు జరపాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) ఎస్.ప్రణతి వాదనలు వినిపిస్తూ.. నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగానే భూకేటాయింపులు చేస్తున్నట్లు నివేదించారు. భూకేటాయింపులతో ముడిపడి ఉన్న అన్ని వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేస్తామని, అందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. అంగీకరించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.